
రాజయ్యపేటలో ఉన్న అమ్మవారి ఆలయం ఎదుట నీళ్ల బిందెలతో మత్స్యకార మహిళలు
● రాజయ్యపేటలో బాకీర్తమ్మకు మత్స్యకారుల పూజలు
నక్కపల్లి: ‘అమ్మా బాకీర్తమ్మ.. మమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతున్నావు.. నిన్నే నమ్ముకున్నాం.. ప్రాణాలకు తెగించి వేట సాగిస్తూ పూటగడుపుకొంటున్నాం.. అటువంటి మాపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టింది.. బల్క్ డ్రగ్ పార్క్ రూపంలో రాజయ్యపేట మత్స్యకారుల మనుగడకు ముప్పు కలిగించేందుకు ఒడిగట్టింది.. నీవే కాపాడాలమ్మా’అంటూ రాజయ్యపేట మత్స్యకారులు గురువారం వేడుకున్నారు. గ్రామంలో మత్స్యకారులంతా బాకీర్తమ్మ ఆలయం వద్దకు చేరుకుని బిందెలతో నీళ్లు ఆలయ మెట్లపై పోస్తూ అమ్మవారిని ప్రార్థించారు. రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకంగా మొట్టమొదటగా బాకీర్తమ్మ ఆలయం సమీపంలోనే 25 రోజుల కిందట నిరసన కార్యక్రమం ప్రారంభించారు. అప్పటి నుంచి వేట, ఉపాధి పనులు మానుకుని మత్స్యకారులంతా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మహిళలంతా బిందెలతో నీళ్లు పట్టుకుని బాకీర్తమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో ఆలయం ముందు నిళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించారు. ‘నీ పాదాల చెంత నుంచే ఉద్యమం ప్రారంభించాం.. మా ఆరాధ్య దైవం నూకతాత ఆశీస్సులతో కొనసాగిస్తున్నాం.. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేసే బాధ్యత మీదేనమ్మా’అంటూ వేడుకున్నారు.

బాకీర్తమ్మ ఆలయం