
రౌడీషీటర్ దారుణ హత్య!
ఎంవీపీకాలనీ : ఇద్దరు రౌడీషీటర్ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం ఒకరి హత్యకు దారి తీసింది. ఈ నెల 7వ తేదీ రాత్రి సీతమ్మధారలోని ఆక్సిజన్ టవర్స్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట శ్రీధర్, గౌరీశంకర్ పాతనేరస్తులు. శ్రీధర్‌పై విజయవాడలో, గౌరీశంకర్‌పై యలమంచిలిలో రౌడీషీట్లు ఉన్నాయి. వీరు పలు నేరాల్లో నిందితులు కాగా విశాఖలోని త్రీటౌన్, పీఎం పాలెం పోలీసు స్టేషన్ల పరిధిలో సైతం గతంలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన ఇద్దరు విశాఖ జిల్లా కోర్టుకు వాయిదాకు హాజరయ్యారు. అనంతరం కారులో నగరమంతా తిరుగుతూ మద్యం సేవించారు. 7వ తేదీ రాత్రి 2 గంటల సమయంలో (8వ తేదీ తెల్లవారి) సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ సమీపంలో ఓ మహిళ విషయమై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది ఘర్షణకు దారి తీయడంతో గౌరీశంకర్ శ్రీధర్‌పై దాడిచేసి పలు చోట్ల కత్తితో గాయపరిచాడు. నరాలు తెగి విపరీతంగా రక్తస్రావం కావడంతో శ్రీధర్ స్పృహ కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న గౌరీశంకర్ కారులో శ్రీధర్‌ను వేసుకొని యలమంచిలి వైపు బయలుదేరాడు.
ఉదయం 6 గంటలకు యలమంచిలి వద్ద పరిశీలించగా శ్రీధర్ మరణించినట్లు గుర్తించాడు. దీంతో కాళ్లు, చేతులు కట్టేసి యలమంచిలిలోని పోలవరం కెనాల్‌లోకి మృతదేహాన్ని విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేరే కేసులో ఈ నెల 9న పోలీసులు గౌరీశంకర్‌ను విచారిస్తున్న సయయంలో ఈ హత్యోదంతం వెలుగు చూసినట్లు ఎంవీపీ సీఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఉదయం పరిశీలించగా బాడీ లభ్యమైందన్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై శ్రీధర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.