
యలమంచిలి పోలీసులు ఓవరాక్షన్ చేశారు...
యలమంచిలి సీఐ, పట్టణ ఎస్‌ఐ టీడీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగం చేస్తారా?
జగన్ పర్యటనకు వెళ్లకుండా పార్టీ
నాయకులకు తీవ్ర అడ్డంకులు సృష్టించారు
ఎప్పుడూ కూటమే అధికారంలో ఉండదని గుర్తుంచుకోవాలి
విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ధర్మశ్రీ ధ్వజం
యలమంచిలి రూరల్ : యలమంచిలి సీఐ, పట్టణ ఎస్‌ఐలు కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగం చేద్దామనుకుంటున్నారేమో? మిగిలిన ప్రభుత్వాల్లో మైదాన ప్రాంతాల్లో పనిచేయక్కర్లేదు, శంకరగిరిమాన్యాలు చూడొచ్చని అనుకుంటున్నారేమో? వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్ జగన్ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులు మాత్రం హుందాగా వ్యవహరించారని, కానీ యలమంచిలి పట్టణ మహిళా ఎస్‌ఐ సావిత్రి మాత్రం గురువారం ఓవర్ యాక్షన్ చేశారని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం యలమంచిలి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడిని చూడడానికి ద్విచక్రవాహనాలపై వెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డగించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారన్నారు. తమ నాయకుడు ఉప్పులూరి కిరణ్ కారును ఆపి తాళాలు తీసుకుని అందులో ప్రయాణిస్తున్న వారందరినీ దింపేశారన్నారు. పరిస్థితులు కలకాలం ఇలా ఉండిపోవని, ఇది తప్పని పట్టణ ఎస్‌ఐను గ్రహించాలన్నారు. ఎస్‌ఐ తీరు మార్చుకోవాలని అన్నారు. వై.ఎస్ జగన్ పర్యటనను సూపర్ సక్సెస్ చేసిన ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్న వివిధ వర్గాల వారు తమ అధినేత దృష్టికి సమస్యలను తీసుకెళ్లారన్నారు. మునగపాక మండలంలో సుమారు 1280 మంది రైతులు రహదారి విస్తరణలో భూములు కోల్పోయారని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూ నిర్వాసితులందరికీ నష్టపరిహారంగా నగదు చెల్లించాలని నిర్ణయించామన్నారు. సాధారణ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులంతా తప్పనిసరిగా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అనేక రకాలుగా వారిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాంబిల్లి ఎన్‌ఏఓబీ ఏర్పాటుతో ప్రభావిత గ్రామాలను గుర్తించకపోవడంతో 6 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాంబిల్లి మండలం కృష్ణంపాలెం వద్ద సెజ్ భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పునరావాసం ప్యాకేజీలో భాగంగా పంచదార్ల వద్ద ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇలాంటి ప్రధాన సమస్యలన్నింటినీ గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన తమ అధినేత దృష్టికి తీసుకొచ్చిన బాధితుల పక్షాన మద్దతుగా నిలిచి, వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం ఇస్తామని చెబుతున్న టీడీఆర్ బాండ్లు నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావన్నారు. నియోజకవర్గంలో జనసేన నాయకులు చేస్తున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణా గురించి అధినేత దృష్టికి తీసుకెళ్లామన్నారు.