
రక్షణ లేని బాలికల హాస్టల్
రావికమతం: స్థానిక బీసీ బాలికల వసతి గృహంలో రక్షణ కొరవడింది. ప్రహరీ తక్కువ ఎత్తులో ఉండడంతో గురువారం వేకువజామున పిచ్చికుక్క హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను గాయపరిచింది. ఇక్కడ కొత్తగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రహరీలో కొంత భాగం పడగొట్టారు. కేవలం మూడడుగుల ఎత్తులో ఉన్న గోడకు గ్రీన్ మ్యాట్ కట్టి ఉంచారు. దీంతో పిచ్చి కుక్క హాస్టల్‌లో చొరబడి విద్యార్థినులను గాయపర్చింది. గురువారం తెల్లవారుజామున ముగ్గురు విద్యార్థినులు కాలకృత్యాల కోసం బాత్‌రూముకు వెళ్లేందుకు బయటికి రాగా అదే సమయంలో గ్రీన్ మ్యాట్‌ను చీల్చుకుంటూ పిచ్చికుక్క దాడి చేసింది. వారు కేకలు వేయడంతో తోటి విద్యార్థినులు బయటకు రాగా వారిపైనా దాడి చేసింది. ఇలా 12 మంది గాయపడ్డారు. వారిని వార్డెన్ లలితా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ విషయం తెలిసిన బాలికల తల్లిదండ్రులు ఆస్పత్రికి పరుగులు తీశారు.
డీఎంహెచ్‌వో పరామర్శ
గాయపడిన విద్యార్థినులను డీఎంహెచ్‌వో హైమావతి శుక్రవారం పరామర్శించారు. ఆస్పత్రికి వచ్చి వైద్య సేవలపై ఆరా తీశారు. మంచి వైద్యం అందించాలని రావికమతం పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి తెలిపారు. రేబిస్, స్నేక్ వెనం టీకాలు ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
పిచ్చికుక్క దాడి.. ఇద్దరికి గాయాలు
మాడుగుల రూరల్: మండలంలోని కె.జె.పురంలో శుక్రవారం సాయంత్రం ఇద్దరిని పిచ్చికుక్క కరిచింది. గ్రామానికి చెందిన కాళ్ల వెంకట్రావు(46) ముత్యాలమ్మ గుడి వద్ద గ్యాస్ డెలివరీ చేసి వస్తుండగా, వెనుక నుంచి వచ్చి కుడికాలు మీద కరిచి గాయపర్చింది. మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స పొందాడు. రాపేట పార్ధు(11)ను కరిచి గాయపర్చగా స్థానిక పీహెచ్‌సీలో పొందాడు.

రక్షణ లేని బాలికల హాస్టల్