
అన్నదాతలను ఆదుకోవడంలో విఫలం
మునగపాక: అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నదాత సుఖీభవ నిధులు కొద్ది మంది రైతులకు మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. గతంలో పెద్దమొత్తంలో చెరకు సాగు జరిగేదని, గిట్టుబాటు ధర లేకపోవ డంతో క్రమేణా దానికి స్వస్తి పలికి, వరి సాగు చేస్తున్నారని తెలిపారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు రూ.35 కోట్ల మేర బకాయిలు చెల్లింపునకు ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉండేదని, నేడు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రైతులకు అండగా రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ నేతలు గుడివాడ అమర్‌నాఽథ్,బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు,ఎంపీటీసీలు సూరిశెట్టి రాము,మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,ఇల్లా శిరీషా నాగేశ్వరరావు,బొడ్డేడ బుజ్జి, పార్టీ నేతలు మొల్లేటి శంకర్,నరాలశెట్టి తాతారావు,శ్రీపతి రామకృష్ణ,ఆడారి రమణబాబు,బొడ్డేడ సోమరాజు,ఎంజే నాయుడు పాల్గొన్నారు.
జగనన్న పర్యటన సూపర్ సక్సెస్
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సూపర్ సక్సెస్ అయిందని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం మాకవరపాలెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవో లేదంటూ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలను సవాలుగా తీసుకుని మెడికల్ కళాశాలకు వచ్చిన జగనన్నకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారన్నారు. పోలీసులు ఆంక్షలు విధించినా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సూపర్ సక్సెస్ కావడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు.