
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
యలమంచిలి రూరల్: ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితుల్ని యలమంచిలి రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండలంలోని షేకిళ్లపాలెం హైవే కూడలి వద్ద అనకాపల్లి నుంచి తుని వైపు ఒక బస్తాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా పట్టుకున్నారు. తమిళనాడు తిరువళ్లూర్ జిల్లా గుమ్మిడిపూండి తాలూకా ఆర్ని గ్రామానికి చెందిన నిందితులు ఆర్ సంతోష్ శివం, జే కార్తీక్ 17 కేజీల గంజాయిని తరలిస్తున్నట్టు తేలిందని యలమంచిలి రూరల్ ఎస్సై ఎం ఉపేంద్ర తెలిపారు. నిందితులు ఒడిశా ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయిని తరలిస్తున్నట్టు విచారణలో తెలిసిందన్నారు. ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామన్నారు.