
జాతీయ ఆహార కమిషన్ సభ్యుడు ఆకస్మిక తనిఖీలు
యలమంచిలి రూరల్: జాతీయ ఆహార కమిషన్ సభ్యుడు బి.కాంతారావు గురువారం యలమంచిలి పట్టణంలో రేషన్ డిపోలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అమలును పరిశీలించిన ఆయన పలు లోపాలు గుర్తించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూస్తున్నామన్నారు. తొలుత యాతపేటలో ఉన్న రేషన్ డిపోలో బియ్యం నేలపై వినియోగదారులకు సరఫరా చేస్తున్నందున మెమో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రేషన్ షాపుల్లో బియ్యం అపరిశుభ్ర పరిస్థితుల్లో సరఫరా చేస్తున్నట్టు గుర్తించి డీలర్లను హెచ్చరించారు. అనంతరం సమీపంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు అందించే పోషకాహారంలో నాణ్యతా లోపం ఉండకూడదని నిర్వాహకులకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ బాలికోన్నత పాఠశాల, కొత్తపేట జెడ్పీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. బాలికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు వడ్డిస్తున్న ఆహార పదార్థాలను అధికారులతో కలిసి రుచి చూశారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, ఆహాయ భద్రత, సంక్షేమ హాస్టళ్ల అధికారులు పాల్గొన్నారు.