
ఆకలి తీర్చని ని‘బంధనాలు’
బుచ్చెయ్యపేట: రెండు కళ్లు లేని తనకు, వృద్ధురాలైన తన తల్లికి రెండు నెలలుగా రేషన్ బియ్యం, సరకులు ఇంటికి అందించకపోవడంపై రాజాం గ్రామానికి చెందిన దివ్యాంగుడు నడిపల్లి సన్యాసినాయుడు సోమవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. పుట్టుకతోనే రెండు కళ్లు లేని తనకు, 80 ఏళ్లు వయస్సు కలిగిన తన తల్లికి రెండు నెలలుగా గ్రామానికి చెందిన రేషన్ డీలరు ఇంటికొచ్చి సరకులు ఇవ్వక పస్తులుంటున్నామని ఆయన తహసీల్దార్‌కు ఇచ్చిన అర్జీలో ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి నిత్యావసర వస్తువులు అందించాలని ప్రభుత్వం చెబుతున్నా తమ గ్రామ రేషన్ డీలర్ అమలు చేయడం లేదని వాపోయారు. గత నెలలో కూడా రేషన్ సరకులు ఇవ్వకపోవడంతో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్‌కు నేరుగా, కలెక్టర్, సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రిలకు పోస్టులో ఫిర్యాదు చేశానన్నారు. తహసీల్దార్ లక్ష్మిని దీనిపై వివరణ కోరగా దివ్యాంగుడైన సన్యాసిరావుది సింగిల్ కార్డు కాదని, ఇతని కార్డులో అతని తల్లి పేరు కూడా ఉందని, ఆమె వయస్సు 65 సంవత్సరాలుగా రేషన్ కార్డులో నమోదైందని, అందువల్ల లిస్టులో పేరు రాకపోవడంతో డీలరు ఇంటికెళ్లి సరకులు అందించలేదన్నారు. తల్లి వయస్సు మార్పు చేయించి ఇంటికే రేషన్ సరకులు అందేలా చూస్తామన్నారు.
దివ్యాంగుడు, అతని 80 ఏళ్ల తల్లికి
అందని రేషన్