
రేషన్ సరకుల కోసం 12 కి.మీ. నడవాలా?
దేవరాపల్లి: చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని స్థానిక గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని కోరుతూ చింతలపూడి, సమ్మెద, వంతెవానిపాలెం గిరిజనులు సోమవారం ఆందోళన చేపట్టారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవికి వినతిపత్రం అందజేశారు. వీరి ఆందోళనకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ తామరబ్బ, చింతలపూడి పంచాయతీలకు కొన్నేళ్లుగా తామరబ్బ పంచాయతీ పరిధిలోని ముకుందపురంలోని రేషన్ డిపోలో సరకులు పంపిణీ చేస్తుండడంతో చింతలపూడి పంచాయతీలోని 12 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వంతెవానిపాలెం, బోడిగరువు, నేరెళ్లపూడి గ్రామాలకు సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుందని, ప్రతి నెలా సరకుల కోసం కాలి నడకన వెళ్లి నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే అంశంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ విచారణ జరిపి చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక రేషన్ డిపో ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డి.శ్రీను, ఎం. ఎర్రునాయుడు, డి.దేవి, డి.ఉమ, వి.వెంకటేష్, టి.రాములమ్మ, కె.గౌరునాయుడు తదితర గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు.
చింతలపూడిలో డిపో ఏర్పాటు చేయాలని
గిరిజనుల ఆందోళన