
అర్జీలకు సకాలంలో పరిష్కారం
● కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశం
● పీజీఆర్‌ఎస్‌కు 232 అర్జీలు
తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలకు సకాలంలో సరైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మొత్తం 232 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖ 128, పంచాయతీ రాజ్ 23, పోలీస్ 17, పలు శాఖలకు మిగిలిన అర్జీలు నమోదయ్యాయి.
కూటమి అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ
కూటమి నాయకుల అక్రమాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన పలువురు బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన తెలిపారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు పలు గ్రామాల ప్రజలు తరలివచ్చి కూటమి నాయకుల అనధికారక వ్యవహారాలపై ఫిర్యాదులు చేశారు. ఏడాది కాలంగా గ్రామాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు పెరిగిపోయాయని, కంపెనీల పేరుతో బాధితులకు చెల్లించే నష్టపరిహార జాబితాల్లో అనర్హులైన కూటమి నాయకుల పేర్లు చేర్చేసి అర్హులను తొలగిస్తున్నారని పలువురు ధ్వజమెత్తారు. అధికారులు కూడా కూటమి నాయకుల తొత్తులుగా మారుతున్నారంటూ కలెక్టరేట్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు.
నిర్వాసితులకు రైల్వేలో ఉద్యోగమివ్వాలి
రాజుపాలెం రైల్వే వంతెన నిర్మాణంలో భాగంగా భూమి, భవనం కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వ మార్కెట్ విలువకు ఐదు రెట్లు నష్టపరిహారంతో పాటు నిరుద్యోగులైన తమ పిల్లలకు రైల్వేలో ఉద్యోగం అవకాశం కల్పించాలంటూ జీవీఎంసీ విలీన గ్రామం కె.ఎన్.ఆర్.పేటకు చెందిన బాధితుడు గైపూరి భాస్కరరావు కలెక్టర్‌ను వేడుకున్నారు. కష్టాలు పడి నిర్మించుకున్న ఇంటికి నామమాత్రపు నష్టపరిహారం చెల్లించి తమను రోడ్డున పడేసే ప్రయత్నాలకు అంగీకరించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం పునరాలోచన చేసి భూములు కోల్పోతున్న రైతులకు చదరపు గజాల్లో విలువ కట్టి నష్టపరిహారం చెల్లించాలని, తమకు మరో చోట పునరావాసం కల్పించాలని కోరారు.
ఆర్టీసీలో ప్రత్యేక సీట్ల కోసం వినతి
అనకాపల్లి: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ప్రత్యేక సీట్లు కేటాయించి, రాయితీలు కల్పించాలని జిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కాండ్రేగుల అప్పారావు కోరారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సీ్త్రశక్తి పథకం అమలు చేయడం వల్ల వృద్ధులకు బస్సుల్లో సీట్లు లేకుండాపోయాయన్నారు. వృద్ధులకు ప్రత్యేక సీట్లు, ప్రయాణంలో 25 శాతం రాయితీ కల్పించాలని వినతిపత్రం అందజేశారు.
ఎస్పీ కార్యాలయానికి 32 అర్జీలు
ఆర్జీదారుల సమస్య వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 32 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. భూతగాదాలు–18, కుటుంబ కలహాలు–2, మోసాలకు సంబంధించి–2, వివిధ విభాగాలకు చెందినవి–10 అర్జీలు వచ్చాయన్నారు. చట్ట పరిధిలో ఉన్న అర్జీలకు 7 రోజుల్లో పరిష్కరించాలని దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అర్జీలకు సకాలంలో పరిష్కారం

అర్జీలకు సకాలంలో పరిష్కారం