
వేర్వేరు చోట్ల నీటిలో జారిపడి ఇద్దరి మృతి
● తెనుగుపూడిలో చెరువులో
మునిగి టెన్త్ విద్యార్థి
● బోయిలకింతాడలో
శారదానదిలో పడి మరో వ్యక్తి
● రెండు ఘటనలపై పోలీసుల దర్యాప్తు
దేవరాపల్లి: మండలంలో సోమవారం వేర్వేరు చోట్ల నీటిలో ప్రమాదవశాత్తు జారిపడి ఓ ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనుగుపూడికి చెందిన పదో తరగతి విద్యార్థి పెనగంటి మోహన్‌రావు(15), అతని స్నేహితుడు రొంగలి హేమంత్‌తో కలిసి వారి కళ్లాలకు సమీపంలో తారురోడ్డుకు ఆనుకొని ఉన్న రాజు చెరువు దగ్గరకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో మోహన్‌రావు ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగిపోయాడు. హేమంత్ కేకలు వేయడంతో స్థానికులు కొందరు చెరువులో దిగి బాలుడు ఆచూకీ కోసం గాలించారు. నీటిలో మునిగిన బాలుడిని బయటకు తీయగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 అంబులెన్స్ సిబ్బంది వైద్య పరీక్షలు జరిపి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఇంటి నుంచి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు రమణ, దేవి గుండెలవిసేలా రోదించారు. మృతుడి తండ్రి రమణ ఫిర్యాదు మేరకు దేవరాపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● మండలంలోని బోయిలకింతాడలో భర్నికాన అప్పలరాజు(35) సోమవారం ఉదయం శారదానదికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారిపడి నదిలో మునిగి మృతిచెందాడు. మృతుడికి భార్య రత్నం, నవీన్, ఝాన్సీ పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య, స్థానిక విద్యా కమిటీ చైర్‌పర్సన్ రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ పైడిరాజు తెలిపారు. ఈ రెండు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

వేర్వేరు చోట్ల నీటిలో జారిపడి ఇద్దరి మృతి

వేర్వేరు చోట్ల నీటిలో జారిపడి ఇద్దరి మృతి