
అనధికారిక లేఅవుట్లతో పంట భూములకు నష్టం
అనధికారిక లేఅవుట్లతో వర్షపునీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తుమ్మపాలకు చెందిన టీడీపీ, సీపీఎం నాయకులు, రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. తుమ్మపాల సర్వే నంబర్లు 39, 316, 317లలో భూములు ఉన్న టి.అప్పారావు అనే ఆసామి తన భూమిలో అనధికార లేఅవుట్ వేసి వర్షపునీరు శారదానదిలోకి ప్రవహించకుండా రాతి గోడలు నిర్మించారని కలెక్టర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. దీంతో ఎగువన ఉన్న రైతుల భూముల్లో నీరు నిలిచిపోయి పంటలు మునిగిపోతున్నాయని వాపోయారు. మండల రెవెన్యూ, పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని బాధిత రైతులు చెప్పారు. సుమారు 370 ఎకరాల్లో పంట నష్టం జరుగుతుందని, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బొడ్డపాటి చినరాజారావు, గొంతిని గంగాజలం, ఎస్.రాజు, పీలా బుజ్జి, గంగిరెడ్ల రమణ, బొడ్డపాటి అప్పలనాయుడు, మహిళలు పాల్గొన్నారు.