
పాదచారిని తప్పించబోయి మృత్యు ఒడికి..
● పులపర్తి వద్ద ప్రమాదంలో నేవీ ఉద్యోగి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో మృతి చెందిన నేవీ ఉద్యోగి రఘురామిరెడ్డి
ప్రమాద స్థలంలో విరిగిపోయిన కిలోమీటరు రాయి
యలమంచిలి రూరల్: దసరా పండుగకు కుటుంబంతో ఆనందంగా గడపడానికి వెళ్తున్న నేవీ ఉద్యోగిని యలమంచిలి మండలం పులపర్తి కూడలి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తుండగా పాదచారిని తప్పించబోయి తాను ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు చేయలేక రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు నేవీ ఉద్యోగి పి.రఘురామిరెడ్డి(31). ఇదే ప్రమాదంలో పులపర్తికి చెందిన పాదచారి పులి మల్లికార్జున్ (55) తీవ్రంగా గాయపడ్డారు. యలమంచిలి పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి అందజేసిన వివరాల ప్రకారం మృతుడు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విశాఖపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న బైక్ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ యలమంచిలి మండలం పులపర్తి వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. పాదచారితో పాటు డివైడర్‌ను ఢీకొట్టిన బైకు పల్టీలు కొట్టింది. బైకు నడుపుతున్న రఘురామిరెడ్డికి హెల్మెట్ ఉన్నప్పటికీ ప్రమాదస్థలంలోనే తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. రోడ్డు పక్కనున్న కిలోమీటరు రాయి సైతం విరిగిపోవడాన్ని బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రమాదస్థలం వద్ద భయానక పరిస్థితులు కనిపించాయి. ప్రమాదం కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. మృతదేహాన్ని యలమంచిలి మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆధార్ వివరాలతో చిరునామా తెలుసుకున్న పోలీసులు అతడి భార్యకు ఫోన్ చేసి ప్రమాద సమాచారం అందజేశారు. ప్రమాదంలో పాదచారుడు మల్లికార్జున్ కాలు విరిగిపొయింది. గాయపడిన వ్యక్తికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదంపై గాయపడిన మల్లికార్జున్ అన్నయ్య పులి సన్యాసినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

పాదచారిని తప్పించబోయి మృత్యు ఒడికి..