
నర్సీపట్నం టీడీపీలో లుకలుకలు
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీలోని టీడీపీ నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. దీనికి శనివారం జరిగిన మున్సిపల్ సమావేశం వేదికై ంది. మున్సిపాలిటీలోని టీడీపీ నేతలపై ఆ పార్టీకి చెందిన 18వ వార్డు కౌన్సిలర్ విజయాంబ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా టీడీపీకి చెందిన కొంతమంది నేతలు కుట్రపన్ని తన వార్డులో వారికి నచ్చిన పనులను అధికారులతో చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వార్డులో విలువ లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. వారికి అధికారులు వంతపాడుతున్నారని తెలిపారు. ఈ పరిణామమం టీడీపీ నేతల్లో విస్మయం కలిగించింది. మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అధ్యక్షతన నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 18వ వార్డు కౌన్సిలర్ శెట్టి విజయాంబ తన వార్డులో జరుగుతున్న పరిణామాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు.
పారిశుధ్య నిర్వహణ సరిగ్గా చేపట్టడం లేదని చెప్పారు. ఉత్తరవాహిని సమీపంలో డంపింగ్ యార్డు వల్ల నదీజలాలు కలుషితమవుతున్నాయని, యార్డును మార్చాలని తెలిపినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సొంతపార్టీ నాయకులు, అధికారుల తీరుకు నిరసనగా ఆమె సభ నుంచి వాక్‌అవుట్ చేశారు. గత పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి కౌన్సిలర్‌గా ఈమె గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఇంతలోనే తిరుగుబాటు చేయడం టీడీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. తన వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి కనీసం సమాచారం ఇవ్వడం లేదని 19వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ బయపురెడ్డి చినబాబు అధికారులను నిలదీశారు. సమాచారం ఇచ్చేలా చూడాలని చైర్‌పర్సన్ సుబ్బలక్ష్మి కమిషనర్‌ను ఆదేశించారు. తప్పని సరిగా సమాచారం ఇవ్వాలని సిబ్బందికి చెబుతున్నామని, తాము సొంతంగా పనులు చేపట్టడం లేదని, కౌన్సిల్ నిర్ణయం మేరకు జరుగుతున్నాయని కమిషనర్ సురేంద్ర బదులిచ్చారు.
పారిశుధ్యం అధ్వానంగా ఉందని మున్సిపల్ వైస్‌చైర్మన్ కోనేటి రామకృష్ణ, జనసేన కౌన్సిలర్ అద్దెపల్లి సౌజన్య తెలిపారు. అభివృద్ధి పనుల్లో కూడా వివక్ష చూపుతున్నారని రామకృష్ణ చెప్పారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు అన్ని వార్డులు సమానమేనని టీడీపీ కౌన్సిలర్ సీహెచ్.పద్మావతి తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై రామకృష్ణ, టీడీపీ కౌన్సిలర్ మధు మధ్య వాగ్వాదం జరిగింది. శానిటేషన్‌పై అధికారులు దృష్టిసారించాలని, వార్డుల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సంబంధిత కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ సూచించారు.