మిట్టల్‌–నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

మిట్టల్‌–నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

Sep 27 2025 4:49 AM | Updated on Sep 27 2025 4:49 AM

మిట్టల్‌–నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌పై నేడు ప్రజాభిప్రాయ స

మిట్టల్‌–నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌పై నేడు ప్రజాభిప్రాయ స

నక్కపల్లి: ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై శనివారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఏపీ కాలుష్యనియంత్రణ మండలి చందనాడ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. జపాన్‌కు చెందిన ఆర్సెలర్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌తో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రాజయ్యపేట, చందనాడ, డీఎల్‌ పురం, వేంపాడు, అమలాపురం, మూలపర గ్రామాల పరిధిలో పోర్టు ఆధారిత ఉక్కుపరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది చివరలో ప్రభుత్వం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 2,200 ఎకరాలు స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. టౌన్‌షిప్‌ అభివృద్ధి కోసం మరో 440 ఎకరాలు కేటాయించాలని మిట్టల్‌ గ్రూపు ప్రభుత్వాన్ని కోరింది. ఏడాదికి 7.30 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యతో ఈ కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. రెండోదశలో 10.5మిలియన్‌మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్టాంట్‌ కోసం మరో 3,800 ఎకరాలను కేటాయించాలని కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది.మొదటిదశ 2029 నాటికి, రెండోదశ 2033 నాటికి పూర్తిచేయాలనేది నిర్ణయం. మొదటి దశలో 20 వేల మందికి, రెండో దశలో 35 వేల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మొదటి దశ ప్రాజెక్టు కోసం భూముల కేటాయింపుపూర్తయింది. స్టీల్‌ప్లాంట్‌ అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని ఉపయోగిస్తారు. రోడ్డు, పైపు లైన్ల ఏర్పాటు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. సరుకు రవాణా , ముడిసరుకు ఎగుమతులు దిగుమతుల కోసం రూ.100 కోట్ల వ్యయంతో క్యాప్టి పోర్టు ఏర్పాటు చేయనుంది. ఏపి ట్రాన్స్‌కో ద్వారా రాయితీపై విద్యుత్‌ సరఫరా చేయనుంది. ఇక తమ్మయ్యపేటనుంచి కాగిత, చినదొడ్డిగల్లు మీదుగా గుల్లిపాడు రైల్వేస్టేషన్‌ వరకు కొత్త రైల్వే లైను ఏర్పాటు చేసేందుకు సర్వే జరుగుతోంది. స్టీల్‌ప్లాంట్‌ అవసరాల కోసమంటూ రాష్ట్రప్రభుత్వం కాగిత, నెల్లిపూడి,డిఎల్‌పురం, వేంపాడు గ్రామాల్లో మరో 2,500 ఎకరాలు భూసేకరణకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఆయా గ్రామాలప్రజల్లో ఆందోళన, అనుమానాలు నెలకొన్నాయి. డిమాండ్లకు అనుగుణంగా నష్టపరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు.

స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలు

కల్పించాలని డిమాండ్‌

మిట్టల్‌–నిప్పన్‌ స్టీల్‌ ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎస్‌ఆర్‌ నిధులతో బాగా వెనుకబడిన గ్రామాల్లో తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలు క ల్పించాలని కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన రైతులకు ఆర్‌ కార్డులు మంజూరు చేసి, వారందరికీ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సమస్య రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలని, పర్యావరణానికి ఈ ప్రాంత మత్స్యకారులకు చేపల వేటకు ఎటుంటి విఘాతం హానీ కలగకుండా చర్యలు చేపట్టాలని, ఈవిషయంపై ప్రజాభిప్రాయసేకరణలో స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ కారణంగా గ్రామాల్లో ఉపాధి కోల్పోయిన రైతులు, వివిధ రకాల చేతివృత్తులవారికి ,అనుబంధ రంగాల వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపించాలని ఆయా వర్గాల వారు కోరుతున్నారు.

భారీ బందోబస్తు

ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు కుమార స్వామి, అప్పన్న, రామకృష్ణల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టు నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. బల్క్‌ డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ రాజయ్యపేటలో మత్స్యకారులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరింత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement