
నెల రోజుల్లో ఆక్వా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
దేవరాపల్లి: ఆక్వా రైతులంతా నెల రోజుల్లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్స్‌లు తీసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి జి. విజయ సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించారు. దేవరాపల్లి మండలంలో 72 చెరువులు ఉన్నాయని, సదరు రైతులంతా రిజిస్ట్రేషన్ చేయించుకొని, లైసెన్స్ పొందాలని సూచించారు. ప్రతి ఆక్వా రైతు పట్టాదారు పాసు పుస్తకం, వన్‌బీ, ఆధార్, నో అబ్జెక్షన్ ధ్రువపత్రం, పంచాయతీ తీర్మానం పత్రాలను సమర్పించాలన్నారు. చేపలకు మేతగా పౌల్ట్రీ వ్యర్థాలు, నిషేధిత ఆహార పదార్థాలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలతో పాటు రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తామని ఆమె హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 1862 చెరువులు ఉన్నాయని, వీటిలో 1443 చెరువులకు అనుమతులు ఉన్నాయన్నారు. ముఖ్యంగా వెనామి రొయ్యలు, పంగసియాస్, రాంగడి, బొచ్చు చేపలను పెంచితే స్థానిక మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. మండల వ్యవసాయ అధికారి కాంతమ్మ, మాడుగుల మత్స్యశాఖ అభివృద్ధి అధికారి నాగమణి, మత్స్యశాఖ అధికారులు ఎ.రమణ, రజాక్ పాల్గొన్నారు.
జిల్లా మత్స్యశాఖ అధికారి విజయ సూచన