
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం
నక్కపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రా నుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు మంగళవారం రాత్రి అంకురార్పణ జరిగింది. ఉదయం ఉత్సవ కావిడిని మాడవీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు కానుకలుగా సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు ఆలయ అర్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, భాగవతం గోపాలాచార్యులు, పీసపాటి శేషాచార్యులు ఆధ్వర్యంలో స్వప్న తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్య దిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణం (పుట్టమన్ను తెచ్చే కార్యక్రమం) నిర్వహించారు. తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తి చేసి గరుడ అవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 2 వరకు జరుగుతాయి. ఉత్సవాల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ధ్వజస్తంభం, బేడామండపం, వేణుగోపాలస్వామి సన్నిధిలో రంగురంగుల పెంటార్లు, లైటింగ్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో కల్కి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం వల్ల ఎన్నో విశేష ఫలితాలు వస్తాయని ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు తెలిపారు. సాక్షాత్తూ బ్రహ్మదేవుడే స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారన్నారు. ఈ సమయంలో స్వామిని దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోయి ఈతిబాధల నుంచి విముక్తి కలుగుతుందన్నారు.
అంకురార్పణతో ప్రారంభం

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం