
15 నెలల కూటమి పాలనలో మహిళలకు అసంతృప్తి
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి
అనకాపల్లి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలల్లో మహిళల హామీలు నెరవేర్చకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి విమర్శించారు. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డులోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత ఆధ్వర్యంలో మహానేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి శోభా హైమావతి, పార్టీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశంలో హైమావతి మాట్లాడుతూ కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలు అమలుగాక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా 18 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వకపోవడం మోసం చేయడమేనన్నారు. 2029 ఎన్నికల్లో మరోసారి సీఎంగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని మరిన్ని సంక్షేమ పథకాలు అందుకోవాలని వెయ్యి నేత్రాలతో ఎదురు చూస్తున్నట్లు ఆమె జోష్యం చెప్పారు. గత పాలనలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మరో 50 శాతం కల్పించడం వల్ల రాష్ట్రంలో వారికి రాజ్యాధికారం వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీ జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి అన్ని విభాగాల్లో మహిళా కమిటీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవారని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుని మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ కూటమి పాలనలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడు పోరాటాలు చేస్తుందన్నారు. అనంతరం ఈర్లె అనురాధకు లోచల సుజాత శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాళ్లు మర్రిపల్లి శోభ, సీలం నదియా, జిల్లాలో వివిధ నియోజకవర్గ, మండల మహిళా విభాగం అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా మహిళా కమిటీ సభ్యులు తేగాడ లక్ష్మి, బేతిరెడ్డి రత్నం, మాకిరెడ్డి విజయలక్ష్మి, ధనలక్ష్మి, కామిరెడ్డి లక్ష్మి పాల్గొన్నారు.