
జల దిగ్బంధం
చోడవరం: భారీ వర్షానికి చోడవరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆదిదేవుడైన వినాయకుడికి కూడా నీట ముంపు తప్పలేదు. మంగళవారం మధ్యాహ్నం చోడవరం పరిసరాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 2 గంటల పాటు కుండపోతగా వర్షం కురవడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు చోట్ల స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి గర్భాలయం కూడా నీట మునిగింది. స్వామివారి ప్రధానాలయం ఏనుగుబోదు చెరువు గర్భంలో ఉండడంతో భారీ వర్షాలకు చెరువు నిండిపోయింది. దీంతో స్వామివారి గర్భాలయంలో చెరువు ఊటనీరు బయటకు రావడంతో ఆలయంలో స్వామివారి మూలవిరాట్ విగ్రహం మునిగిపోయింది. గర్భాలయంలోకి ఊరుతున్న నీటిని బయటకు పంపించేందుకు మోటార్ల సాయంతో చర్యలు చేపట్టారు. పట్టణంలో బానీకోనేరు, పూర్ణా థియేటర్, రెల్లివీధి, బాలాజీనగర్, న్యూశాంతినగర్ కాలనీలు నీట మునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది. కాలువల్లో స్కిల్టు తీయకపోవడంతో రోడ్లపై నీరు కాల్వల ద్వారా బయటకు వెళ్లే దారిలేకుండా పోయింది. పూర్ణాథియేటర్, రెల్లి వీధిలో ఇళ్లన్నీ నీట మునిగాయి. రోడ్లపై ఎక్కడిక్కడ నీరు నిలిచిపోవడంతో చోడవరం–అనకాపల్లి, చోడవరం–నర్సీపట్నం ప్రధాన రహదారులపై పెద్దపెద్ద గోతులు పడి వాహనచోదకులకు ప్రాణాంతకంగా మారాయి. చోడవరం–చీడికాడ రోడ్డుపై వర్షపు నీరు ప్రవహించింది. ముంపు ప్రాంతాల ప్రజలను తహసీల్దార్ రామారావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి.

జల దిగ్బంధం

జల దిగ్బంధం