
‘దసరా సెలవులు ఇవ్వని విద్యా సంస్థలపై చర్యలు’
అనకాపల్లి: జిల్లాలో పలు ప్రైవేట్ విద్యా సంస్థలు దసరా సెలవులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబ్జి, ఫణీంద్ర ఆరోపించారు. స్థానిక కోడిగంటి గోవిందరావు భవనంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. సెలవు దినాల్లో పాఠశాలలను నడపడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెరిచి ఉన్న పాఠశాలల వద్ద ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సింహాద్రి అభిషేక్, అజయ్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.