
యర్రయ్య గల్లంతుపై త్రిసభ్య కమిటీ విచారణ
అచ్యుతాపురం రూరల్: పూడిమడక గ్రామానికి చెందిన చోడిపల్లి యర్రయ్య గల్లంతుపై మంగళవారం త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ ఏడాది జులై 2న యర్రయ్య(26) చేపల వేటకు వెళ్లి భారీ చేపకు చిక్కి బలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం తహసీల్దార్ జి.సత్యనారాయణ, సీఐ నమ్మి గణేష్, ఫిషరీస్ ఏడీ విజయ సచివాలయంలో హాజరై గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. గల్లంతైన యర్రయ్య మృతి చెందాడని నిర్ధారణ అవడంతో కుటుంబీకులు డెత్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి సరస్వతి తెలిపారు. డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఇతర ధ్రువపత్రాల ఆధారంగా మృతుని కుటుంబానికి పరిహారం అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విచారణలో వీఆర్‌వో అప్పలరాజు, యర్రయ్య తల్లి మాయావతి, గ్రామ పెద్దలు మేరుగు ప్రవీణ్ కుమార్, వాసుపల్లి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.