
న్యాయం కావాలి
వాడనర్సాపురం పైడమ్మ చెరువు
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పైడమ్మ చెరువు హక్కుల విషయంపై రగులుతున్న వివాదం ముదురు పాకానపడుతోంది. ఇప్పటికే ఈ చెరువుపై పట్టు సాధించేందుకు నేవల్ బేస్ ప్రయత్నిస్తుండగా, చెరువు పరిధిలో ఉన్న రెండు గ్రామాల మత్స్యకార ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ చెరువు చుట్టూ నేవల్ బేస్ చేపట్టిన ఫెన్సింగ్ పనుల్ని నిలిపివేయాలని కొత్తపేట సర్పంచ్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా వాడనర్సాపురానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు హైకోర్టుకు వెళ్లారు. అత్యంత సున్నితమైన సమస్యగా మారిన ఈ చెరువు నేవల్ బేస్ ప్రధాన గేట్‌కు ఎదురుగా ఉంది. ఇదే చెరువు చుట్టూ ఉన్న ప్రధాన గ్రామాల్లో వాడనర్సాపురం, కొత్తపేటలు ఉన్నాయి. సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో 30 ఎకరాల వరకూ ఆక్రమణలు, పట్టాల పంపిణీ జరిగింది. మిగిలిన చెరువులో మత్స్యకారులు దశాబ్దాల తరబడి చేపల వేట సాగిస్తున్నారు. స్థానికంగా పెంచే పశువులకు గడ్డి, నీటి వసతికి ఇది ఆసరాగా ఉంది. అయితే వాడనర్సాపురం ఎదురుగా ఉన్న ఈ చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేస్తే నేవల్ బేస్‌కు మరింత ఆకర్షణతోపాటు, నీటి వనరుగా మారుతుందనే యోచనతో గతంలో స్థానిక పంచాయతీల ప్రత్యక్ష ఆమోదం లేకుండానే అప్పటి రెవెన్యూ అధికారులు నేవల్ బేస్‌కు దఖలు పరిచారు. దీనిని ఆసరాగా తీసుకున్న నేవల్ బేస్ అధికారులు చెరువుపై పట్టు సాధించేందుకు ఇటీవల కాలంలో ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించారు. పనులు ప్రారంభించిన ప్రతిసారి మత్స్యకారులు వెళ్లి అడ్డుకోవడం, అధికారులు సర్దిచెప్పడం షరా మామూలుగా మారింది. నేవల్ బేస్ వచ్చిన తర్వాత సముద్రంపైనా, శారద నదిపైనా పట్టు కోల్పోయిన ఈ ప్రాంత మత్స్యకారులకు ఏకైక చేపల వేట వనరుగా పైడమ్మ చెరువు మిగిలింది. నేవల్ బేస్ ప్రభావిత గ్రామాల్లో కొత్తపేట, వాడనర్సాపురంతో పాటు ఏడు మత్స్యకార పల్లెలు ప్రధానంగా పైడమ్మ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. తమ గ్రామాలను తరలించక తప్పని పరిస్థితి వస్తే.. ఆ తర్వాతే చెరువును నేవీకి అప్పగించాలని, తమకు ఆసరాగా ఉన్న పైడమ్మ చెరువు విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవద్దని నేవల్ బేస్ అధికారులకు మత్స్యకారులు మొర పెట్టుకుంటున్నారు. మరోపక్క తమకు న్యాయం చేయమని కొత్తపేట, వాడ నర్సాపురం వాసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు త్వరలో విచారణకు రానున్నాయి.
వాడనర్సాపురం తీరంలో షెల్టర్ కింద వలలపై దిగులుగా కూర్చున్న వృద్ధ మత్స్యకారులు
పైడమ్మ చెరువును కట్టబెట్టి
మా పొట్ట కొట్టకండి
చెరువును నేవీకి అప్పగిస్తే
మేం ఎలా బతకాలి?
ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన
కొత్తపేట సర్పంచ్
తాజాగా వాడనర్సాపురం
మత్స్యకార ప్రతినిధులు
అచ్యుతాపురం సెజ్‌తోపాటు బార్క్, నేవల్ బేస్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని తంతడి, పూడిమడక, వాడరాంబిల్లి, వాడనర్సాపురం, కొత్తపట్నం గ్రామాల మత్స్యకారులు సముద్రంపై పట్టు కోల్పోయారు. ఇటీవల కాలంలో వాడనర్సాపురానికి చెందిన వృద్ధ మత్స్యకారులు తీరంలో ఉన్న షెల్టర్‌లో పగలంతా కాలక్షేపం చేసి రాత్రి వేళ ఇంటికి పరిమితం అవుతున్నారు. పూడిమడకలో ఉప్పుటేరు కలుషితం అవుతుండగా, ఉప్పు గల్లీ భూముల బదలాయింపు ప్రక్రియకు రెవెన్యూ అధికారులు పూనుకున్నారు. ఇక వాడనర్సాపురం, కొత్తపేట మత్స్యకారులు తమకు స్వేచ్ఛ పోయిందని, ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడకు వెళ్లగలిగే తమకు అడుగడుగునా ఆంక్షలు ఎదురవుతున్నాయని కన్నీరు పెడుతున్నారు. పరిశుద్ధంగా ఉండే ఉప్పుటేరు కలుషితం కావడం, చెరువుల చుట్టూ ఫెన్సింగ్ వేయాలని అధికారులు ప్రయత్నించడం పట్ల వారు వేదన చెందుతున్నారు. పాలకులు, అధికారులు అండగా నిలవకపోవడంతో కోర్టులను ఆశ్రయించాల్సిన స్థితికి చేరామని వాపోతున్నారు. ప్రజల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు అవసరమే అయినప్పటికే వారి ఉనికికి భంగం కలిగించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థానికుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది.
చెరువే ఆధారం
మా బతుకుతెరువు పోతోంది. సముద్రంలోకి వేటకు వెళ్తే చనిపోతున్నాం. ఆ పక్కన నిర్మిస్తున్న ఒక నిర్మాణం వల్ల మాకు ఈ గతి పట్టింది. శారద నదిలోకి ఎలాగూ వెళ్లలేకపోతున్నాం. గ్రామం ఉన్నంతకాలం చెరువే ఆధారం. మా బాధను కూడా అర్థం చేసుకోండి. మేమెలా బతుకుతామో ఆలోచించండి.
–పైడిరాజు, వాడనరసాపురం
గ్రామాలను తరలించిన తర్వాతే..
మా తాతల కాలం నుంచి పైడమ్మ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నాం. చేపల వేటతోపాటు మా పశువులకు కూడా ఆ చేరువే ఆధారం. ఒకప్పుడు సముద్రంలో వేటకు వెళ్లేందుకు అవకాశం ఉండేది. శారద నదిలోకి వెళ్లేందుకు ఉన్న అవకాశాన్ని అడ్డుకునేలా నేవల్ బేస్ వారు గోడలు కట్టారు. ఇప్పుడు మిగిలిన ఆధారం పైడమ్మ చెరువు. దీని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేస్తే మా బతుకు తెరువు ఎలా చెప్పండి. మా గ్రామాలను తరలించిన తర్వాతే చెరువు విషయంలో నిర్ణయం తీసుకోండి.
–మెరుగు నూకరాజు, వాడనరసాపురం

న్యాయం కావాలి

న్యాయం కావాలి

న్యాయం కావాలి