
గుంతలు పూడ్చలేకపోతే కాంట్రాక్టు వదులుకోండి
రావికమతం: బిల్లులు చెల్లించకుంటే ఇకపై రోడ్డు అభివృద్ధి పనులు చేయలేమని బీఎన్ రోడ్డు కాంట్రాక్టర్ చెప్పడంతో.. గుంతలు పూడ్చలేకపోతే కాంట్రాక్టు వదులుకొమ్మని ఆర్‌అండ్‌బి చీఫ్ ఇంజినీరు విజయశ్రీ స్పష్టం చేశారు. రావికమతం మండలం గర్నికం–మేడివాడ గ్రామాల మధ్య బీఎన్ రోడ్డుపై ఏర్పడిన భారీ గుంతలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ భారీ గుంతల వల్ల వాహనదారులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులను మండల ప్రజా పతినిధులు పలుమార్లు ఆర్ అండ్ బీ అధికారుల దృష్టికి వచ్చారు. దీనిపై స్పందించిన చీఫ్ ఇంజినీర్ విజయశ్రీ తక్షణమే గుంతలను పూడ్చించాలని కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావును ఆదేశించారు. ప్రస్తుత పరిస్ధితుల్లో రోడ్డు పనులు చేయలేమని కాంట్రాక్టర్ చెప్పారు. బిల్లులు చెల్లించకుంటే పనులు చేయలేమని కాంట్రాక్టర్ చెప్పడంతో అతడిపై చీఫ్ ఇంజినీర్ విజయశ్రీ మండిపడ్డారు. గుంతలు పూడ్చలేని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని సూచించారు.
అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో చేపడుతున్న, నిర్మాణంలో ఉన్న పనులకు సుమారు రూ.130 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల విడుదలకు కృషి చేస్తామని చెప్పారు. అప్పటి వరకు రోడ్డుపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్‌ను కోరామని తెలిపారు.
బీఎన్ రోడ్డు కాంట్రాక్టర్‌కు స్పష్టం చేసిన
ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్