ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

Sep 19 2025 1:55 AM | Updated on Sep 19 2025 1:55 AM

ప్రభు

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

● బల్క్‌డ్రగ్‌పార్క్‌ రద్దుచేయాల్సిందే ● ఐదోరోజు కొనసాగిన మత్స్యకారుల ఆందోళన

నక్కపల్లి: బల్క్‌ డ్రగ్‌పార్క్‌ వ్యవహారంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని, ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కి తగ్గేది లేదని మత్స్యకారులు స్పష్టం చేశారు. బల్క్‌ డ్రగ్‌పార్క్‌ రద్దుచేయాలంటూ రాజయ్యపేట మత్స్యకారులు చేపట్టిన నిరాహారదీక్ష గురువారం ఐదో రోజు కొనసాగింది. శాంతియతంగా నిరసన తెలుపుతున్న మత్స్యకారులకు పోలీసులు ఆంటంకాలు కల్పిస్తున్నారు. టెంట్లువేసేందుకు, మైక్‌ సెట్‌కు పర్మిషన్‌ ఇవ్వ లేదు. దీంతో గురువారం కూడా మండుటెండలో గొడుగులు పట్టుకుని నిరాహారదీక్ష కొనసాగించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన మత్స్యకారులు, ఇతర సామాజిక వర్గాల వారు పనులు, వేటమానుకుని నిరసన దీక్షలో పాల్గొన్నారు. బల్క్‌ డ్రగ్‌పార్క్‌ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత మంతా కాలుష్యంతో నిండిపోతుందని, మత్స్య సంపద నాశనమవుతుందని మత్స్యకారులు తెలిపారు. ఇప్పటికే హెటెరో పరిశ్రమ వల్ల వాయుకాలుష్యం బారిన పడుతున్నామని, వ్యర్థ రసాయనాలు సముద్రంలో వదిలివేయడం వల్ల మత్స్య సంపద నాశనమైందని, వేటకు వెళ్తే చనిపోయిన చేపలు లభ్యమవుతున్నాయని వారు చెప్పారు. ఈ ప్రాంతంలో వేట లేకపోవడంతో పూరీ, పారాదీప్‌, శ్రీశైలం, నాగార్జున సాగర్‌, అంతర్వేది ,నెల్లూరు, వంటి ప్రాంతాలకు వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. అలాగే స్థానికులు కిడ్నీసమస్యలతో బాధపడుతున్నారన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వస్తే పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని, పరిసర ప్రాంతాలన్నీ శ్మశానాలుగా మారుతాయన్నారు. ఇప్పటికే పరవాడ, అచ్యుతాపురం వంటి ప్రాంతాల్లో ఇవే సమస్యలు వస్తున్నాయన్నారు. భూములు తీసుకునే సమయంలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని మాకు చెప్పలేదని ఆరోపించారు. కంపెనీల కోసమంటేనే భూములు ఇచ్చామని ఇటువంటి ప్రాణా లు తీసే పరిశ్రమలయితే ఇచ్చేవారం కాదన్నారు.

మత్స్యకారులకు అండగా నిలుస్తాం

మత్స్యకారులకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం తెలిపింది. నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణలు నిరాహర దీక్షలో పొల్గొన్నారు. ఈసందర్భంగా కంబాల జోగులు మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా నిలుస్తామన్నారు. వారి అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే టెంట్లు వేసుకోడానికి అనుమతి నిరాకరించడం తగదన్నారు. కనీసం మైక్‌ పెట్టుకుని అవకాశం కల్పించడం లేదన్నారు. ఇటువంటి దుస్థితి చూస్తే ప్రజాస్వామ్యాంలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు, బల్క్‌ డ్రగ్‌వస్తే వందలాది రసాయన పరి శ్రమలు వస్తాయని మత్స్యకారులు భయపడుతున్నారని, గతంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, అనితలు ఇక్కడ రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తామని ప్రకటించిన విషయాన్ని మత్స్యకారులు గుర్తుచేస్తున్నారని చెప్పారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. కూటమి పెద్దలు మత్స్యకారుల డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమలో రసాయన పరిశ్రమలు ఎందుకు పెట్టడం లేదు

రసాయన పరిశ్రమలు రాయల సీమ జిల్లాల్లో ఎందుకు పెట్టడం లేదని కాపుకార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ ప్రశ్నించారు. ఇటువంటి కంపెనీలు పెడితే అక్కడి ప్రజలు తరిమి కొడతారన్నారు. ఎలక్ట్రానిక్‌, కార్ల తయారీ పరిశ్రమలు, పవర్‌ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు రాయలసీమ జిల్లాల్లో పెడుతూ ప్రజల ప్రాణాలు తీసే రసాయన పరిశ్రమలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెడుతున్నా రని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా ప్రజలు అమాయకులని, ప్రభుత్వాలు ఏం చేసినా చేతులు ముడుచు కుని కూర్చొంటారని, చేతకాని వారిలా చిత్రీకరించి ఈ ప్రాంతాల్లో ప్రమాదకర పరిశ్రమలు పెడుతున్నారన్నారు. ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలిగే ఒక్క పరిశ్రమకూడా ఈ ప్రాంతంలో పెట్టలేదన్నారు.బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుపై పునరాలోచన చేయాలన్నారు.

వైఎస్సార్‌సీపీ చొరవతో టెంట్ల ఏర్పాటుకు అనుమతి

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, కాపుకార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు గోసల కాసులమ్మ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు,మత్స్యకార నాయకుడు ఎరిపిల్లి నాగేశు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు,సత్తియ్య, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు మత్స్యకార నాయకులు గురువారం డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ కుమారస్వామి, తహసీల్దార్‌ నర్సింహమూర్తిని కలిశారు. శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తుంటే టెంట్లు వేసుకునేందుకు అనుమతి నిరాకరించడం తగదన్నారు. మండు టెండలో మత్స్యకారులు దీక్ష కొనసాగిస్తున్నారని, ఎండ వేడి వల్ల ఎవరికై నా ఏమైనా జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. టెంట్లు వేసుకునేందుకు, మైక్‌సెట్‌ పెట్టుకుని వారి సమస్యలు చెప్పుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన డీఎస్పీ శ్రీనివాసరావు టెంట్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఎటువంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆందోళనలో మత్స్యకార నాయకులు మైలపల్లి సూరిబాబు, యజ్జల అప్పలరాజు, కాశీరావు,మహేష్‌, రాజశేఖర్‌, నూకరాజు, పైడితల్లి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం 1
1/2

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం 2
2/2

ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement