
డ్రగ్స్, నేర రహితంగా జిల్లా
తుమ్మపాల: జిల్లాను నేర, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రితో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన జిల్లాకు సంబంధించిన అంశాలపై ఆమె గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, బస్టాపుల వద్ద, గ్రామాల్లో ఆకతాయిల బెడద నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు సూక్ష్మ సేద్యం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని, జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. గ్రామాల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టడంతో పాటు మునగ ఆకుల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. దోబీ ఘాట్లలో ఆధునిక వసతులు, బ్యాంక్ లింకేజీ కల్పించాలన్నారు. అక్టోబర్ 1న ఆటో డ్రైవర్లకు రూ.15వేల సాయం అందించనున్నట్టు చెప్పారు. గ్రామాల్లో శ్మశానవాటికలను నిర్మించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని, మేకలు, గొర్రెల పెంపకానికి పీఎంఈజీసీ దరఖాస్తులను పరిశీలించాలన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు స్థల పరిశీలన చేయాలన్నారు. గ్రామాల్లో ట్యాంకులు, చెక్ డ్యామ్‌లను శుభ్రపరచాలని, రోడ్లపై గుంతలు పూడ్చడానికి అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. బెల్టు షాపులు లేకుండా చూడాలని, మైనింగ్ శాఖ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్