రోడ్లపై ‘బీర్ల వరద’
యలమంచిలి రూరల్: బీర్లు తరలిస్తున్న వాహనాలు మండలంలోని రెండు ప్రాంతాల్లో ప్రమాదాలకు గురవడంతో సీసాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిలో సగానిపైగా పగిలి.. రహదారులపై బీర్ల వరద పారింది. కింగ్ ఫిషర్ అల్ట్రా బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలు బుధవారం ప్రమాదాలకు గురయ్యాయి.ఈ రెండు ప్రమాదాలు 16వ నంబరు జాతీయ రహదారిపై యలమంచిలి మండల పరిధిలో జరిగాయి. వివరాలివి.. తండాలదిబ్బ కూడలి వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి బీర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో సుమారుగా 86 కేసుల్లో బీర్ల సీసాలు పగిలిపోయినట్టు యలమంచిలి ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.పగిలిన బీర్ల సీసాల విలువ సుమారుగా రూ.రెండు లక్షలకు పైగా ఉంటుందని అంచనా.రణస్థలం బెవరేజస్ నుంచి కడప ప్రభుత్వ డిపోకు ఈ బీర్ల లోడు లారీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.అయితే దీనిపై యలమంచిలి రూరల్ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం, ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి బాగున్న సరుకును మరో లారీలోకి ఎక్కించేక్రమంలో ఎకై ్సజ్ పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.ప్రమాదానికి గురైన కంటైననర్ లారీలో మొత్తం 1,275 బీర్ల కేసులు వెళ్తుండగా 86 కేసుల్లో సీసాలు పాడైనట్టు ఒకసారి,మొత్తం 1,270 కేసులే ఉన్నాయని,వాటిలో 95 కేసుల్లో బీర్ల సీసాలు డ్యామేజ్ అయ్యాయని మరోసారి ఎకై ్సజ్ పోలీసులు ఘటనాస్థలానికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులకు చెప్పడం గమనార్హం.ఇదిలా ఉండగా ప్రమాదానికి గురైన బీర్ల లారీ నుంచి సరుకును మరో లారీలోకి మార్చిన తర్వాత ఆ వాహనాన్ని మూడు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఎర్రవరం సమీపంలో ఒక పెట్రోల్ బంక్ వద్ద గంటల సేపు నిలిపి ఉంచారు.అబ్కారీ శాఖకు చెందిన బీర్ల లోడు ప్రమాదానికి గురైనపుడు ఎంత సరుకు దెబ్బతిందో నిర్థారించడానికి నిర్వహించాల్సిన పంచనామాలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది.అంతేకాకుండా రణస్థలంలో బీర్ల లోడుతో బయలుదేరిన లారీ ఎప్పుడు ప్రమాదానికి గురైందో ఎవరూ కచ్చితంగా చెప్పకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో బయటపడాల్సి ఉంది.
పులపర్తి వద్ద బీర్ల వ్యాన్ బోల్తా
యలమంచిలి మండలం పులపర్తి వద్ద బీర్ల లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది.యలమంచిలి నుంచి తునివైపు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో భారీగా బీర్లు,ఇతర మద్యం సీసాల లోడుకు నష్టం వాటిల్లింది.డ్యామేజ్ కాకుండా మిగిలిన సరుకును అక్కడ సిబ్బంది వేరు చేశారు.ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీర్ల లోడుతో వెళ్తున్న రెండు వాహనాలకు ప్రమాదం
తండాలదిబ్బ వద్ద ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న బీర్ల లారీ
పులపర్తి వద్ద మరో వ్యాన్ బోల్తా
రోడ్లపై ‘బీర్ల వరద’


