బకాయి పడ్డ బిల్లులు, జీతాలు వెంటనే విడుదల చేయాలి
చోడవరం : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రావలసిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద చోడవరం మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న నిర్వాహకులంతా కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేశారు. తమకు గత డిసెంబరు నెల నుంచి నేటి వరకూ మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన బిల్లులు మంజూరు కాలేదని, బకాయి పడ్డ బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని వరలక్ష్మి డిమాండ్ చేశారు. బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టామని, అప్పులకు వడ్డీలు కట్టుకోలేక చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఐదు నెలలుగా బిల్లులు రాకపోతే వచ్చే జూన్ నుంచి పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు ఎలా భోజనం పెట్టగలమని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతినెలా 15వ తేదీకి బిల్లులు వచ్చేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదని ఆమె ధ్వజమెత్తారు. అదే విధంగా తమ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వడం లేదని, ఇదే ఉపాధిగా నమ్ముకొని జీవిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులందరం జీతాలు రాక, బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని చెప్పారు. వెంటనే ప్రభుత్వం తమ జీతాలు, బిల్లులు చెల్లించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో సంఘ ప్రతినిధులు జి.లక్ష్మి, నారాయణమ్మ, ఎర్రయ్యమ్మ, బి. లక్ష్మి, దేముడమ్మ, సత్యవతి, దేవి పాల్గొన్నారు.
మధ్యాహ్నభోజన పథకం నిర్వాహకుల డిమాండ్
ఎంఈవో కార్యాలయం వద్ద ధర్నా


