కూటమి సర్కారు కుటిల యత్నం
అచ్యుతాపురం: అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య, నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోంది. ఏ ఒక్కరికీ అంగీకారం లేని టీడీఆర్‌ను తెరపైకి తీసుకొచ్చి బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తుంది. రెండు దశాబ్దాల నుంచి నలుగుతున్న భూసేకరణకు ఎటువంటి తక్షణ పరిహారం ఇవ్వకుండా కేవలం కాగితాలు ఇచ్చి పని కానిచ్చేయాలన్న ప్రభుత్వం తీరు ఈ ప్రాంతంలోని రైతులు, నిర్వాసితుల హృదయాలను కలిచివేస్తోంది. టీడీఆర్ విషయం తేల్చకుండానే రెండు బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ పనులను ప్రారంభించి, ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది.
తొందరపాటెందుకు..?
అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ అంశం ఎప్పటి నుంచో నలుగుతోంది. రెండు దశాబ్దాల కాలంలో మూడు ప్రభుత్వాలు మారాయి. 9 రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశంలో పరిహారం అందించిన తర్వాతే రోడ్డు వేయాలని ఇప్పటి వరకూ పాలకులు భావించగా.. నేటి కూటమి ప్రభుత్వం టీడీఆర్ తీసుకునే విధంగా ఎన్‌వోసీపై సంతకాలు చేసేందుకు సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసిన పరిహారం అంశం తేల్చకుండానే పనులు ప్రారంభించేసింది. తద్వారా బలవంతంగానైనా టీడీఆర్‌లను రైతులపై రుద్ది భూములను లాక్కోవాలన్న ఎత్తుగడ ఆందోళన రేకెత్తిస్తోంది. కాంట్రాక్టర్ అచ్యుతాపురం జంక్షన్‌లో ప్లైఓవర్ పనులు, హరిపాలెం, మునగపాక వద్ద బ్రిడ్జి పనులకు ఉపక్రమించారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేని చోట రోడ్డు విస్తరణ, పక్కన డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. తద్వారా భూములివ్వని వారిని ఆత్మ రక్షణలో పడేసేలా కాంట్రాక్టర్, ప్రభుత్వం ఉన్నట్లుగా అర్థం అవుతోంది.
అధికారులపైనా ఒత్తిడి..!
ఈ ప్రాంతంలోని రెవెన్యూ అధికారులపై ఒక కూటమి నేత తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామ సభల్లో టీడీఆర్‌ల అంశంపై తీవ్ర వ్యతిరేకత రాగా.. వారిని ఒప్పించలేకపోయారంటూ రెవెన్యూ యంత్రాంగంపై ఆ నేత చిందులు తొక్కినట్టు తెలుస్తోంది. ఒక తహసీల్దార్ సెలవుపై వెళ్లడానికి కారణం ఇదేనా.. అన్న చర్చ సాగుతోంది. టీడీఆర్‌లపై ఇంకా స్పష్టత లేదని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలోని సిబ్బంది ఒకపక్క చెబుతుండగా.. మరోపక్క పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డుకు ఆనుకొని ఉన్న భూముల్ని కోల్పోవడం వల్ల వచ్చిన పరిహారంతో వేరొక చోట ఇల్లు కట్టుకొని స్థిరపడవచ్చన్న ఆశతో ఉన్న రైతులకు టీడీఆర్ ప్రతిపాదన అశనిపాతంగా మారింది.
పరిహారంపై తేల్చకుండానే అచ్యుతాపురం – అనకాపల్లి రహదారి పనులు ప్రారంభం
టీడీఆర్ బాండ్లు వద్దంటున్నా నిర్వాసితుల గోడు పట్టించుకోని వైనం
ఆర్ అండ్ బీ పరిధిలో చురుగ్గా పనులు
నిర్వాసితులను ఆత్మరక్షణలోపడేసే పన్నాగం
ఆత్మరక్షణలో రైతులు
అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ పనులు ప్రారంభించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం దారుణం. టీడీఆర్‌లకు ఒప్పుకోబోమని ఇప్పటికే రైతులు చెప్పారు. పరిహారం ఇవ్వకుండా, స్పష్టత ఇవ్వకుండా పనులు మొదలు పెట్టడం ద్వారా రైతుల్ని ఆత్మ రక్షణలో పడేస్తున్నారు. చరిత్రలో ప్రజా కంటకులుగా నిలిచిపోతారు.
– బి.జగన్, ఉప సర్పంచ్, తిమ్మరాజుపేట
టీడీఆర్‌లపై ఒత్తిడి తేవడం సరికాదు
అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణకు సంబంధించి నిర్వాసితులపై ఒత్తిడి తేవడం సరికాదు. ఇప్పటికే మూడు విడతలుగా గ్రామాల్లో సభలు నిర్వహించి పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడు టీడీఆర్‌లు ఇస్తామని చెప్పడం అన్యాయం. ఇది 1200–1550 మంది రైతులు, ప్రజల సమస్య. పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి. – రొంగలి రాము,
సీపీఎం మండల కన్వీనర్, అచ్యుతాపురం
కూటమి సర్కారు కుటిల యత్నం
కూటమి సర్కారు కుటిల యత్నం
కూటమి సర్కారు కుటిల యత్నం


