నకిలీ కరెన్సీ.. రైస్ పుల్లింగ్..
● జనాన్ని దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు ● ముగ్గురిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు
నర్సీపట్నం: సీతారాముల కల్యాణ ఘట్టాన్ని ముద్రించిన మహిమ గల రాగి నాణెం.. రైస్ పుల్లింగ్ చేస్తుంది.. తెల్ల బియ్యంపై పెడితే నల్లరంగులోకి మారిపోతుంది.. అతి విలువైన, అరుదైన ఇరీడియం లోహంగా రూపాంతరం చెందుతుంది.. ఇది మీ వద్ద ఉంటే కుబేరులు కావడం ఖాయం.. అంటూ ఆశ పెడతారు. మాటలతో మాయ చేస్తారు. కనికట్టుతో కట్టి పడేస్తారు. ఇలా రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నర్సీపట్నం, గొలుగొండ ఎస్సైలు రాజారావు, రామారావు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. సీఐ రేవతమ్మ అందించిన వివరాలు.. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ బుచ్చంపేట వెళ్లే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుజుకి సెలెరియో కారు వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురి నుంచి రూ.2.60 లక్షల కరెన్సీ నోట్లను, అమెజాన్ చిల్ట్రెన్ బ్యాంకు నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన రూ.10 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి కారు, మూడు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. విజయనగరానికి చెందిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్ కుమార్, నిమ్మల మన్మధ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. పరారైన నిందితులపై ఐదు కేసులు ఉన్నాయన్నారు. కాయిన్ల పేరుతో ఎవరైనా వస్తే పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 1121001903కు సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు.


