పాడేరు: ఐటీడీఏ ఆధ్వర్యంలోని కాఫీ ప్రాజెక్టులో పనిచేస్తున్న కాఫీ లైజన్ వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్. సుందర్‌రావు తెలిపారు. గురువారం కాఫీ లైజన్ వర్కర్స్ యూనియన్ నాయకులతో కలిసి ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని 11 మండలాల్లో 26 ఏళ్లుగా 156 మంది కాఫీ లైజన్ వర్కర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ.15 వేల వేతనం మాత్రమే అందుతోందని, కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ 23 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీను, కార్యదర్శి సింహాచలం, నాయకులు వాసు, మల్లేష్, వెంకట్ తదితరులు ఉన్నారు.


