అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్ (డుంబ్రిగుడ): స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇద్దామని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అనంతగిరి మండలంలోని పెదకోట, కివర్ల, పినకోట, జినబాడు పంచాయతీల్లో పార్టీ అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాలను ఆవిష్కరించి, కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచేందుకు జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఐడీ కార్డు ఉన్న కార్యకర్తలకు రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.5.50 లక్షల ఆర్థిక సాయం పార్టీ ఫండ్ నుంచి అందిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.


