ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, ఒనకఢిల్లీ వారపు సంతలో గురువారం విదేశీ పర్యాటకులు సందడి చేశారు. ఇటలీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన పర్యాటకులు ప్రత్యేక బస్సుల్లో వచ్చి బోండా ఆదివాసీలతో మమేకమయ్యారు. వారి వేషధారణ, సంస్కృతి, సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలు విక్రయించే పూసలు, రింగులను కొనుగోలు చేసి వారితో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. వించ్ హౌస్‌లో ప్రయాణించి సందడి చేసిన వారు డుడుమ జలపాతం, డుడుమ జలాశయాన్ని కూడా సందర్శించారు.


