దసరాకు.. దండిగా | - | Sakshi
Sakshi News home page

దసరాకు.. దండిగా

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

దసరా పండగ సమీపిస్తున్న వేళ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నాటుకోళ్లు, మేకల అమ్మకాలు ఊపందుకున్నాయి. అమ్మవారి పూజలు, మొక్కుల కోసం గిరిజన ప్రాంతాల్లో వీటి ధరలు ఆకాశాన్నంటుతుండగా... పెంపకందారుల ఇంట ముందే పండగ కళ సంతరించుకుంది. సంతల్లో రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి.

జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో మేకలు, గొర్రెలు, నాటుకోళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విజయదశమి పండగను పురస్కరించుకుని వీటికి డిమాండ్‌తో పాటు ధరలు కూడా ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు వారాలుగా నిలకడగా ఉన్న ధరలు ప్రస్తుతం పెరగడంతో పెంపకందారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాణ్యతకు ప్రత్యేక గుర్తింపు

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పెంచే నాటుకోళ్లు, మేకలు, గొర్రెలు నాణ్యత, ప్రత్యేక రుచిని కలిగి ఉంటాయి. దీంతో వ్యాపారులు, మాంస ప్రియులు పెంపకందారులు చెప్పిన ధరలను చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ధరలు తక్కువగా ఉండటంతో, వ్యాపారులు, దళారులు ఏజెన్సీ సంతల నుంచి వీటిని కొనుగోలు చేసి, వాహనాల ద్వారా మైదాన ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పెంపకందారులు కూడా వారపు సంతలకే ప్రాధాన్యత ఇస్తూ నేరుగా విక్రయిస్తున్నారు.

సంతల నిర్వహణ వివరాలు

మండలంలోని సంతబయలు గ్రామంలో మంగళవారం, మద్దిగరువులో గురువారం, పాడేరులో శుక్రవారం వారపు సంతలు జరుగుతాయి. అలాగే చింతపల్లి మండలంలో ఆదివారం కోరుకొండ, లోతుగెడ్డ జంక్షన్లలో, బుధవారం చింతపల్లిలో, గురువారం లంబసింగిలో సంతలు నిర్వహిస్తారు. గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల్లో కూడా ఈ వారపు సంతలు జరుగుతున్నాయి. దసరా పండగను దృష్టిలో ఉంచుకుని సంతల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

పూజలు, మొక్కుల కోసం అధిక డిమాండ్‌

దసరా పండగ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో పాటు, వాహనాలు, యంత్రాలు, దుకాణాలు, ఆయుధ పూజల కోసం నాటుకోళ్లు, మేకలు, గొర్రెలను ఎక్కువగా ఉపయోగిస్తారు.

రూ.కోట్లల్లో వ్యాపార లావాదేవీలు

నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని వారపు సంతల్లో దసరా సందర్భంగా సుమారు రూ.కోటినుంచి రూ.2 కోట్ల వరకు మేకలు, గొర్రెలు, నాటుకోళ్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

● జి.మాడుగుల వారపు సంతలో కిలో నాటుకోడి రూ.1,100 పలుకగా, 10 కిలోల బరువున్న మేక లేదా గొర్రె రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు అమ్ముడైంది.ఈ ఒక్క సంతలోనే సుమారు 100 మేకలు, గొర్రెలు, 100 నాటుకోళ్లు అమ్ముడుపోగా, రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు అంచనా. ఈ నెల 20న విజయదశమి జరుగనున్న నేపథ్యంలో, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు మూడు వేల మేకలు, గొర్రెలు, 4 వేల నాటుకోళ్ల అమ్మకాల ద్వారా రూ.2 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపారులు మరియు పెంపకందారులు తెలిపారు.

గొర్రె, మేకలు, నాటుకోళ్లకుభారీ డిమాండ్‌

వారపు సంతల్లో పోటీపడి కొనుగోళ్లు

పెంపకందారుల ముఖాల్లో చిరునవ్వు

రూ.కోట్లలో లావాదేవీలు

మంచి ఆదాయం

మా గ్రామంలో ఇళ్ల వద్దనే సంవత్సరమంతా నాటుకోళ్లు, మేకలు, గొర్రెలను పెంచి పెద్దచేసి దసరా పండగను దృష్టిలో ఉంచుకుని వారపు సంతకు తీసుకొచ్చి విక్రయిస్తాం. వీటికి దసరా సమయంలోనే ఎక్కువ డిమాండ్‌తో పాటు మంచి ధరలు పలుకుతుండటంతో వారపు సంతల్లోనే విక్రయిస్తున్నాం. నాటు కోడి పుంజు రూ.2వేలు, మేక పది వేల నుంచి రూ.12 వేలకు విక్రయించాం. ఆశించిన ధర లభించింది.

– భాస్కరరావు, కుంబిడిసింగి,

జి.మాడుగుల మండలం

ధరలు మరింత పెరిగేఅవకాశం

దసరా పండగకు నాటు కోళ్లు, మేకలు, గొర్రెలకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. వినియోగదారుల అవసరాలను బట్టి పెంపకందారులు ధరలు నిర్ణయించారు. మేక, గొర్రె పోతు 10 కిలోలు వారపు సంతలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర పలికింది. ఏటా దసరాకు ముందు రెండు వారాలు వీటి ధరలు పెరుగుతాయి. మేము నాటుకోళ్లు, మేకలు, గొర్రెలకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేశాం.

– అప్పారావు, రావణాపల్లి,

గొలుగొండ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement