● జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు
● మేలు చేసిన భారీ వర్షాలు
సీలేరు: ’కుంభవృష్టి లేదా అనావృష్టి’ అన్నట్లుగా మారిన సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ రిజర్వాయర్లు.. ఇటీవల భారీ వర్షాలకు నిండుకుండలా మారాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక నీటి కొరత ఏర్పడుతుందనుకున్న తరుణంలో, కురిసిన వర్షాలతో ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తికి నీటి ఢోకా లేకుండా పోయింది.
బలిమెలలో భారీగా పెరిగిన నీటిమట్టం:
పది రోజుల క్రితం కేవలం 20 టీఎంసీలుగా ఉన్న బలిమెల జలాశయం నీటిమట్టం, భారీ వర్షాలతో పాటు జోలాపుట్టు నుంచి విడుదలైన నీటితో కలిపి ప్రస్తుతం 99.3382 టీఎంసీలకు చేరింది. పూర్తి స్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా, ప్రస్తుతం 1503.50 అడుగులకు చేరింది. ఒడిశా వాటా కింద గతంలో వాడుకున్న నీటిని మినహాయించినా, ప్రస్తుతం రెండు రాష్ట్రాలకూ విద్యుత్ ఉత్పత్తికి,సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.
ఇతర రిజర్వాయర్ల వివరాలు
● జోలాపుట్టు: పూర్తి స్థాయి నీటిమట్టం 2750 అడుగులు కాగా, ప్రస్తుతం 2746.60 అడుగులుగా ఉంది.
● గుంటవాడ జలాశయం: 1360 అడుగులకు గాను ప్రస్తుతం 1351.4 అడుగులకు నీరు చేరింది.
● డొంకరాయి జలాశయం: రిజర్వాయర్లో ప్రస్తుతం 148.13 టీఎంసీల నీరు ఉంది. ఉపనదుల నుంచి రిజర్వాయర్లకు ఇంకా ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు, ఇరు రాష్ట్రాల జలవిద్యుత్ కేంద్రాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నెలలకు సరిపడా నిల్వలు : భారీ వర్షాల కారణంగా సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో రానున్న ఐదు నెలల పాటు విద్యుత్ ఉత్పత్తికి సరిపడా పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయని చీఫ్ ఇంజనీర్ కె.వి. రాజారావు తెలిపారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం కేంద్రాల్లో అన్ని యూనిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటం వల్ల ప్రస్తుతం లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు ఉత్పత్తిని కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు.


