కట్టిపడేస్తున్న మొర్రిగుడ అందాలు
అరకు అనగానే మనకు టూకీగా గుర్తొచ్చేవి కాఫీ తోటలు, చాపరాయే. కానీ, ఇప్పుడు ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తూ మరో అద్భుతమైన ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోని గసభ పంచాయతీ మొర్రిగుడ నుంచి కనిపిస్తున్న సూర్యోదయ దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. మంచు కొండల నడుమ, తెల్లటి పొగమంచు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించే వేళ... ప్రకృతి ఒలికిస్తున్న ఆ అందాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఈ సుందర దృశ్యాలను ’పాలపుంత సూర్యోదయం’ వ్యూపాయింట్‌గా పిలుస్తున్నారు.
ఎలా చేరుకోవాలి?
అరకు సంతబయలు నుంచి ఆంధ్ర–ఒడిశా కొర్రాయి బీటీ రోడ్డు మీదుగా మొర్రిగుడ చేరుకోవచ్చు. అరకు సంతబయలు నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ వ్యూపాయింట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం పర్యాటక సీజన్ అధికారికంగా ప్రారంభం కావడం, ఉదయవేళల్లో దట్టమైన మంచు కురుస్తుండటంతో... ఈ సరికొత్త సూర్యోదయ ప్రాంతాన్ని తిలకించేందుకు ప్రకృతి ప్రియులు, ఫోటోగ్రఫీ ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరి మీ వీకెండ్ ట్రిప్‌లో ఈ అద్భుతమైన వ్యూపాయింట్‌ను చూసేయండి!
– డుంబ్రిగుడ


