పెందుర్తి: తన కుమారుడు మరణించినా.. అతడి కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపు కలగాలని భావించిన తల్లి మానవత్వాన్ని చాటుకున్నారు. పెందుర్తికి చెందిన పట్నాల అరవింద్ రామస్వామి (28) అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. తీవ్ర విషాదంలోనూ అరవింద్ రామస్వామి తల్లి పట్నాల స్వరూప నేత్రదానానికి అంగీకరించారు. కేజీహెచ్‌లో మృతుడి నేత్రాలను ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థకు చెందిన రమ్య, వాణి సేకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షుడు దాడి శ్రీను మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధలోనూ నేత్రదానానికి అంగీకరించిన స్వరూపను, ఆమె కుటుంబ సభ్యులను అభినందించారు. వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.


