తాటిచెట్లపాలెం: ప్రయాణికులకు సురక్షితమైన తాగునీరు అందేలా ప్రతి వారం తనిఖీలు నిర్వహించాలని సౌత్‌కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్లు, కాలనీలు, ఆస్పత్రులు, హెల్త్ యూనిట్లు, పాఠశాలలు, కార్యాలయాల్లోని తాగునీటి వసతులను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. రైల్వే ప్రయాణికులకు అందుతున్న తాగునీటి నాణ్యతపై సౌత్‌కోస్ట్ రైల్వే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. నాలుగు డివిజన్ల పరిధిలోని స్టేషన్లు, రైల్వే కాలనీలు, ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో పాటు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.
వారం రోజులు ప్రత్యేక డ్రైవ్
గత నెల 25 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 70 స్టేషన్ల నుంచి 2,677 నమూనాలు సేకరించి రెసిడ్యువల్ క్లోరిన్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 82 స్టేషన్ల నుంచి సేకరించిన 226 నమూనాల్లో బ్యాక్టీరియలాజికల్ పారామీటర్లను పరీక్షించగా అన్నింటిలోనూ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఏడు స్టేషన్ల నుంచి సేకరించిన ఏడు నమూనాలను రసాయన పరీక్షలకు పంపగా.. ఆరు నమూనాల ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయని, మరో నమూనా ఫలితం రావాల్సి ఉందని పేర్కొన్నారు. రైల్వే కాలనీల్లో సేకరించిన నమూనాల ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. రైల్వే అధికారులు, సూపర్‌వైజర్లు ఆయా ప్రాంతాలను వ్యక్తిగతంగా పరిశీలించాలని, క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జీఎం ఆదేశించారు.


