వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.2 కోట్లతో నిర్మాణం గతంలో తుఫాన్ల సమయంలో
నాతవరం: గత ప్రభుత్వంలో ఏలేరు కాలువకు ప్రైవేట్ చానల్ (అనుసంధాన కాలువ) నిర్మాణం చేయడంతో ఇటీవల సంభవించిన తుఫాన్ల నుంచి ముంపు ముప్పు తలెత్తలేదు. గతంలో తుఫాన్లు సంభవించినపుడు ఏలేరు కాలువలో నీరు ఉప్పొంగి గండిపడడం జరిగేది. అలాగే కాలువకు ఇరువైపులా ఉన్న గ్రామాలతో పాటు పంట పొలాలు సైతం ముంపునకు గురికావడంతో తీవ్ర నష్టం కలిగించేది. ఈ సమస్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉన్న ఏలేరు కాలువ 154 కిలోమీటర్లు పొడవునా వెంటాడేది. తుఫాన్లు వచ్చినప్పుడల్లా ఏలేరు కాలువ అధికారులతో పాటు కాలువ సమీపంలో ఉన్న మండలాలు, అధికారులు, గ్రామస్తులు ఏలేరు కాలువ నీటి కారణంగా ఏ సమయంలో ఏప్రమాదం సంభవిస్తుందోనని భయం గుప్పెట్లో కాలం వెళ్లదీసేవారు. గత ప్రభుత్వం ఏలేరు కాలువ ప్రమాద సమయంలో గండి పడకుండా, గ్రామాలు ముంపునకు గురి కాకుండా చర్యలు చేపట్టారు. రూ 2 కోట్లతో ఏలేరు కాలువపై ప్రైవేట్ చానల్ నిర్మాణం చేపట్టారు. నాతవరం మండలంలో రాజుపేట అగ్రహారం వద్ద తాండవ నదిలోకి నీరు పోయే విధంగా అనకాపల్లి మండలంలో శారద నదిలోకి నీరు పోయే విధంగా ప్రైవేట్ చానల్స్ నిర్మాణం చేశారు. ఈ చానల్ ద్వారా ఏలేరు కాలువలో నీటిని విడుదల చేయడం ద్వారా ఇటీవల కురిసిన వర్షాలకు రెండు జిల్లాల పరిధిలో ఏలేరు కాలువకు ఎక్కడా గండి పడలేదు. అలాగే గ్రామాలకు ముంపునకు గురి కావడం గానీ పంట పొలాలకు ఎలాంటి నష్టం జరగలేదు. నాతవరం మండలంలో 18 కిలోమీటర్ల పొడవునా 12 గ్రామాలు మధ్యలోంచి ఏలేరు కాలువ ప్రవహిస్తుంది. జిల్లాలో నర్సీపట్నం, కోటవురట్ల, మాకవరపాలెం, కశింకోట, అనకాపల్లి, పరవాడ తదితర మండలాల మీదుగా విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఏలేరు కాలువ ద్వారా నీరు ప్రవహిస్తుంది.
ముంపు సమస్య తప్పింది
ఏలేరు కాలువపై చానల్ నిర్మాణం చేయకముందు వర్షం పడినా, కాలువ ఊప్పొంగిన సమయంలో రాత్రి పగలనే తెలియకుండా కాలువపై తిరిగేవాళ్లం. అయినా ఏదో ఒక చోట నీటి ఉధృతికి కాలువ గండిపడడం పంటపొలాలు మునిగిపోవడం, లోతట్టు గ్రామాలు ముంపునకు గురి కావడం జరిగేది. గండి పడిన చోట పనులు చేసేందుకు రూ. లక్షలు ఖర్చు చేసేవాళ్లం. ఇటీవల తుఫాన్లు సమయంలో ఏలేరు కాలువకు ఎక్కడా గండి పడలేదు. పంటపొలాలు, గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము కూడా కాలువపై ధైర్యంగా తిరుగుతున్నాం.
–గోపినాథ్, ఏలేరు కాలువ జేఈ
భయం గుప్పెట్లో కాలువ సమీప గ్రామాలు


