నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి థెరిస్సా కాలనీకి చెందిన కృష్ణ ఓ గ్యాస్ ఏజెన్సీలో వినియోగదారుడుగా ఉన్నాడు. అతనికి గ్యాస్ అవసరమై పది వారం రోజుల క్రితం బుక్ చేసుకున్నారు. ఐదు రోజులు కావస్తున్నా.. సిలిండర్ రాలేదు. ఇళ్లకు పంపిణీ చేసే బాయ్‌కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది..డీలరుకు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. సిలిండరు వస్తుందో..? రాదో..? తేలియక వినియోగదారులు అయోమయానికి గురయ్యాడు. గత్యంతరం లేక సదరు వ్యక్తి గ్యాస్ డీలర్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీస్తే బుకింగ్ క్యాన్సిల్ అయినట్టు సిబ్బంది చెప్పారు. మరలా బుక్ చేసుకోవాలని సూచించారు. గొడౌన్‌కు వచ్చి సిలిండర్ తీసుకువెళ్లాలని సూచించారు. విధిలేని పరిస్థితిల్లో ఖాళీ సిలిండర్ అప్పగించి నిండిన సిలిండర్ తీసుకెళ్లేందుకు ఖరీదు రూ.960 అయితే రూ.వెయ్యి తీసుకున్నారని వినియోగదారుడు వాపోయారు.
దందాలో సిబ్బంది పాత్ర
గ్యాస్ సిబ్బంది సాంకేతికతను వినియోగించుకుని కొత్త తరహాలో దందాకు తెరతీశారు. వినియోగదారులకు తెలియకుండా సిలిండర్లను బుక్ చేసి పక్కదారిని వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి వినియోగదారుడికి గ్యాస్ డెలివరీ చేసే సమయంలో ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. డెలివరీ బాయ్‌కి ఆ ఓటీపీ చెబితే సిలిండర్ అందజేస్తారు. ఇవన్నీ చేయకుండా ఏజెన్సీ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, కోటవురట్ల మండలాల్లో సుమారు 45 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో పేరుకే 500 పైనే వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. టీ స్టాల్ దగ్గర నుంచి పెద్ద హోటళ్ల వరకు వేలల్లో ఉన్నాయి. వీరంతా డొమిస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే సిలిండరు రూ.980, వాణిజ్య రకం(19కేజీలు) రూ.3500 ఉంది. ఇటీవల పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో వాణిజ్య సిలిండర్ల సరఫరా సంఖ్యను కుదించారు. వినియోగదారులకు గ్రామాల్లో 45 రోజుల నిబంధన పెట్టారు. దీన్ని అదునుగా తీసుకున్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు హోటళ్లు, ఇతర వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను అక్రమ మార్గంలో ఒక్కొక్కటి రూ.1800 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం కొరత తగ్గింది. కానీ దందాకు అలవాటు పడిన గ్యాస్ నిర్వాహకులు వినియోగదారులకు తెలియకుండా వారి పేరుతో బుక్ చేసి వ్యాపారులకు రూ.1800 చొప్పున అమ్ముకుంటున్నారు.
అదనంగా వసూలు
గ్యాస్ నిర్వాహకులు సిలిండర్‌ను డోర్ డెలివరీ ఇవ్వాల్సి ఉండగా ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి అక్కడికి వచ్చి తీసుకెళ్లాలని చెబుతున్నట్టు ఆరోపణలున్నాయి. అదేమని అడిగితే గోదాము దగ్గరకొచ్చి తెచ్చుకోండి..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ధర కంటే అదనంగా రూ.100 నుంచి రూ.150 వసూలు చేస్తున్నుట్టు వినియోగదారులు వాపోతున్నారు. ఈ విషయంపై సీఎస్‌డీటీ అశోక్‌ను వివరణ కోరగా బ్లాక్‌లో సిలిండర్లు విక్రయిస్తే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. డీలర్, కార్యాలయం సిబ్బంది వినియోగదారులకు జవాబుదారీగా ఉండాలని, ఫిర్యాదులు అందితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


