డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11న ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. 12న ధనలక్ష్మిగా అలంకరించి లక్ష చామంతులతో పూజలు చేస్తారు. 13న ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వగా, లడ్డూలతో సహస్రనామార్చన నిర్వహిస్తారు. 14న ధైర్యలక్ష్మిగా అలంకరించి తులసీదళాలతో సహస్రనామార్చన చేస్తారు. 15న సంతానలక్ష్మిగా అలంకరించి కలువపూలతో పూజలు నిర్వహిస్తారు. 16న విద్యాలక్ష్మి అలంకరణలో పంచపుష్పార్చన, 17న విజయలక్ష్మి అలంకరణలో గులాబీ పూలతో పూజలు నిర్వహించనున్నారు.
18న గజలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారికి లక్ష గాజులతో సహస్రనామార్చన చేస్తారు. 19న మహాలక్ష్మి అలంకరణలో శాకాంబరిగా వివిధ రకాల కూరగాయలతో పూజలు నిర్వహిస్తారు. చివరి రోజైన 20న స్వర్ణకవచాలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారికి 108 పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన చేయనున్నారు.
రోజువారీ పూజలు ఇలా..
ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు పంచామృతాభిషేకం, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అష్టలక్ష్మి అలంకరణలో అమ్మవారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచామృతాభిషేకం, రాత్రి 7 గంటల నుంచి సర్వదర్శనాలు ఉంటాయి.


