ఏఐ డేటా సెంటర్లతో ప్రజలకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

ఏఐ డేటా సెంటర్లతో ప్రజలకు ముప్పు

Oct 5 2026 12:21 AM | Updated on Oct 5 2026 12:21 AM

డాబాగార్డెన్స్‌: విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ల వల్ల ప్రజలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ మూవ్‌మెంట్‌ ప్రతినిధి ఫణీంద్ర పేర్కొన్నారు. డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) 10వ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. 8 గిగావాట్ల ఏఐ డేటా సెంటర్ల నిర్వహణకు 40 గిగావాట్ల సోలార్‌ విద్యుత్‌, 5 టీఎంసీల నీరు అవసరమవుతుందన్నారు. పోలవరం నీటిని డేటా సెంటర్లకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డేటా సెంటర్లతో 1.8 లక్షల ఉద్యోగాలు వస్తాయని తొలుత ప్రచారం చేసి, ఆ తర్వాత ఆ సంఖ్యను 10 వేల నుంచి 20 వేల వరకు తగ్గించారని మండిపడ్డారు. పర్యావరణ అనుమతులు తొమ్మిది రోజుల్లోనే ఇచ్చారని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పంప్‌డ్‌ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుల పేరుతో అడవుల విధ్వంసం, గ్రామాల తరలింపు జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రీన్‌ ఎనర్జీ అంటూనే శ్రీకాకుళంలో 3,200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం ఏఐ డేటా సెంటర్ల వల్ల ఎదురయ్యే ప్రమాదాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ను ప్రదర్శించారు. హెచ్‌ఆర్‌ఎఫ్‌ ప్రతినిధి కె.అనురాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.రాజేష్‌, తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్‌ కృష్ణ, ప్రతినిధులు సుధ, శరత్‌, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement