రావికమతం: మండలంలోని గర్నికం గ్రామంలో వ్యాపారి బండారు అచ్చుతరావు(60) ఇంటి ఆవరణలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు రావికమతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్‌ఐ రఘువర్మ, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బండారు అచ్చుతరావు (60) కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అప్పుల వ్యవహారంలో మనస్థాపం చెంది ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అచ్చుతరావు ఇంటి ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటలు వ్యాపించి కలు వేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూసేసరికే శరీరం అంతా 80 శాతం వరకు కాలిపోయి మృతి చెందాడు. స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అచ్చుతరావుది వ్యాపార కుటుంబం. ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వెంకటేష్, కుమార్తె రామలక్ష్మి ఉన్నారు. కొడుకు, కూతురుకి వివాహం అయింది. గతంలో అచ్చుతరావు ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహించేవారు. ప్రసుత్తం అతడి కుమారుడు బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రఘువర్మ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గర్నికం వీఆర్వో ప్రసాద్, వీఆర్‌ఏ సాయి, కుటుంబ సభ్యుల సమక్షంలో సంఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేశారు. సోమవారం శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరిలిస్తామని ఎస్‌ఐ తెలిపారు.


