బుచ్చెయ్యపేట: మండలంలో గల బంగారుమెట్ట కిల్లి వారి పాకలు వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. విద్యుత్ స్తంభం వద్ద ఉన్న సిమెంట్ దిమ్మపై ఉన్న డీపీని దించి ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టి అందులో ఉన్న రాగి వైర్‌ను పట్టుకుపోయారు. మంగళవారం పొలాల్లోకి వెళ్లిన రైతులు వ్యవసాయ మోటార్లు తిరగకపోవడంతో కరెంట్ రాలేదని లైన్‌మ్యాన్‌కు ఫిర్యాదు చేయగా, లైన్‌మ్యాన్ వచ్చి చూడగా ట్రాన్స్‌ఫార్మర్‌లో వైరు చోరీ జరిగినట్టు గుర్తించారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారులు బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో వెంటనే కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సదుపాయం కల్పించి పంటలు ఎండిపోకుండా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇటీవల తరుచూ రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు చోరీ ఘటనలు జరుగుతున్నాయని, వీటిపై పోలీసులు నిఘా వేసి గట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


