నక్కపల్లి: మండలంలో దేవవరం జంక్షన్‌లో మంగళవారం బెల్టుషాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్‌ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సీఐ మురళి అందించిన సమాచారం మేరకు దేవవరం జంక్షన్‌లో పాన్‌షాపుపై దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన బొట్టా రాము నిర్వహిస్తున్న బెల్టుషాపుపై దాడులు చేసి 110 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కస్టమర్లలా వచ్చి దుకాణాల్లో చోరీ
అనకాపల్లి: పట్టణంలో వినాయక చవితిని పురస్కరించుకుని రద్దీగా ఉన్న రెండు బియ్యం దుకాణాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో పట్టపగలే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నగదు చోరీకి పాల్పడ్డారు. వివరాలివి. ఈనెల 12న కూరగాయలు మార్కెట్ వద్ద బియ్యం దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అదును చూసి దుకాణంలో రూ.30 వేలు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా 13న కన్యకాపరమేశ్వరి ఆలయ రహదారిలో బచ్చు వీరభద్ర ప్రకాశరావు బియ్యం దుకాణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి రెండు బియ్యం బస్తాలు కావాలని అడిగారు. బియ్యం దుకాణం యజమాని రామకృష్ణతో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బాత్‌రూమ్‌కు వెళ్లి వెస్తానని చెప్పగా, మరో వ్యక్తి తనకు మరో బియ్యం బస్తా కావాలని చెప్పడంతో దుకాణం యజమానిలోనికి వెళ్లాడు. దీంతో అప్పటికే క్యాష్ బాక్స్ వద్ద బ్యాగ్‌లో ఉన్న రూ.60వేలు నగదును బ్యాగ్‌తో సహా పట్టుకుని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. దీంతో దుకాణ యజమాని రామకృష్ణ సీసీ ఫుటేజీలు ఆధారంగా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష
నక్కపల్లి: ఇటీవల మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారికి యలమంచిలి కోర్టు మంగళవారం రూ.10వేల చొప్పున జరిమానా విధించిందని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని, కేసు నమోదు చేసి వీరిని కోర్టులో హజరు పరచగా జరిమానా విధించిందన్నారు. వీరిలో ఒకరు జరిమానా కట్టలేనందున వారం రోజుల జైలు శిక్ష విధించిందన్నారు.
ఘన, ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన
అనకాపల్లి టౌన్: మున్సిపల్, ఈ వర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఈవో జి.నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాలల్లోని ఘన వ్యర్థాలు, ఈ వ్యర్ధాల నిర్వహణపై ఈనెల 16న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు ఉద్దేశించినట్టు తెలిపారు.


