నేత్రపర్వంగా ఒడ్డిమెట్ట గిరి ప్రదక్షిణ | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా ఒడ్డిమెట్ట గిరి ప్రదక్షిణ

Sep 16 2026 3:49 AM | Updated on Sep 16 2026 3:49 AM

● వందలాదిగా తరలివచ్చిన భక్తజనం ● కోలాటాలు, భజన బృందాలతో శోభాయమానంగా యాత్ర

నక్కపల్లి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి గిరిప్రదక్షిణ సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణలో నక్కపల్లి, అడ్డురోడ్డు, తుని, పాయకరావుపేట పట్టణాలతోపాటు, పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి స్వయంభూగా వెలసిన చోట ఆలయం నిర్మించి పూజలు మొదలుపెట్టిన 150 సంవత్సరాల తర్వాత తొలి సారిగా గతేడాది గిరి ప్రదక్షిణ ప్రారంబించారు. దేవాదాయ ఽశాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ లక్ష్మీగణపతి పూజలందుకుంటున్నాడు. విఘ్నాలు తొలగించే వినాయకుడిగా ప్రాశస్త్యం పొందాడు. గిరిప్రదక్షిణను పురస్కరించుకుని ముందుగా అర్చక స్వాములు జయంతిగోపాలకృష్ణ కై లాసగిరిపై స్వయంభూగా వెలసిన లక్ష్మీగణపతి మూలవిరాట్‌కు, స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి కొండ దిగువన తూర్పు మండపం వద్ద కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. జాతీయ రహదారి, ఒడ్డిమెట్ట పాతరోడ్డు, గుంటపల్లి పాతరోడ్డు, రామాలయం, పశ్చిమ గణపతి మండపం, జాతీయ రహదారి మీదుగా తిరిగి తూర్పు మండపం చేరుకుని అక్కడ నుంచి కై లాసగిరిపైకి చేరుకుంది. మహిళల కోలాటాలు, భజన బృందం సభ్యులు ఆలపిస్తున్న భజన గీతాలతో గిరిప్రదక్షిణ శోభాయమానంగా జరిగింది.

గణపతి బప్పా మోరియా, జైబోలో గణేష్‌ మహారాజ్‌కీ జై అంటూ భక్తులు లంబోదరుడ్ని స్మరిస్తూ గిరిప్రదక్షిణలో ఉల్లాసంగా పాల్గొన్నారు. గణేషుని నినాదాలతో ఒడ్డిమెట్ట పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ గిరిప్రదక్షిణలో చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం మూలవిరాట్‌ ఉన్న ఆలయం చుట్టూ స్వామివారి ఉత్సవ మూర్తులతో ప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులంతా స్వామివారిని దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ తొలిసారిగా ప్రారంభిస్తున్న సమాచారం తెలుసుకున్న ఉద్దండపురం, గొడిచర్ల, దేవవరం, నామవరం, గుంటపల్లి, సీతారామపురం, పాయకరావుపేట తుని, పీఎల్‌పురం, తదితర గ్రామాల నుంచి వందలాది మంది మహిళలు తరలివచ్చి గిరిప్రదక్షిణ పూర్తయిన తర్వాత కూడా కై లాసగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం గమనార్హం. ఈ గిరిప్రదక్షిణలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు జి. నర్సింహమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, పాయకరావుపేట మాజీ ఉప సర్పంచ్‌ జగతా భవానీశ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ వేగేశ్న చంటి, ఒడ్డిమెట్ట దేవస్థాన చైర్మన్‌ పైలా నూకన్ననాయుడు, మాజీ చైర్మన్‌ దండు బలరామరాజు, ఇందుకూరి రవిరాజు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగతా శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement