యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం వాడ రాంబిల్లి సముద్ర తీరంలో సహచర కార్మికుడ్ని కాపాడబోయిన బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు రంజిత్‌కుమార్(18) గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం పోలీసు, మైరెన్, కోస్ట్ గార్డ్, నేవీ శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నేవీ సిబ్బంది హెలికాఫ్టర్‌తో యువకుడు గల్లంతైన ప్రాంతంలో వెతికారు. సోమవారం సాయంత్రం సముద్ర తీరంలో నీటిలో గల్లంతైన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు తెలియలేదు. రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన 17 మంది కార్మికులు సంతోష్‌రామ్ కాంట్రాక్టర్ వద్ద విద్యుత్ పనులు చేయడానికి వచ్చి రాంబిల్లి మండలం గోవిందపాలెం వద్ద శిబిరంలో వసతి పొందుతున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో కార్మికులంతా సరదాగా గడపడానికి సమీపంలో ఉన్న వాడ రాంబిల్లి బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన కార్మికుడు బిపిన్‌కుమార్ సముద్రంలో అలల తీవ్రతకు నీట మునిగిపోతుండడం చూసిన తోటి కార్మికుడు రంజీత్‌కుమార్ అతడ్ని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన ఇద్దరిలో బిపిన్‌కుమార్‌ను స్థానిక ఈతగాళ్లు రక్షించగా, రంజీత్‌కుమార్ జాడ తెలియలేదు. రంజీత్‌కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా బైరియా మండలం పఖానాహే బజార్ ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం బీహార్ నుంచి ఇక్కడకు వచ్చిన యువకుడు సముద్రంలో గల్లంతవడంతో కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. యువకుడు ప్రాణాలతో తిరిగి రావాలని వారంతా దేవుణ్ని ప్రార్థిస్తున్నారు.


