అనకాపల్లి టౌన్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పట్టాల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం.చంద్రరావు సాహసాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనుకాడకుండా స్పందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన చంద్రరావు సేవలను కొనియాడారు. తుని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు కింద పడిన ఓ ప్రయాణికుడు తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రైలు కిందకు వెళ్లి బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కొందరు సంఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రరావు మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం ఆయన మానవత్వానికి నిదర్శనమని అభినందించారు.


