కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన | - | Sakshi
Sakshi News home page

కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు

చింతపల్లి: మండలంలోని కోరుకొండ–బూరుగుబయలు గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన శనివారం కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో అత్యంత మారుమూల ప్రాంతమైన బలపం పంచాయతీలో 33 శివారు గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఘాట్‌ దిగువన ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, పైన ఉన్న అత్యధిక గ్రామాలకు నేటికీ పూర్తిస్థాయి రహదారి లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివాసీలు తమకు ఏ వస్తువు కావాలన్నా కొండలు, గుట్టలు, వాగులు దాటి కోరుకొండ కూడలికి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోరుకొండ–బూరుగుబయలు గ్రామాల మధ్య వంతెన, రహదారి నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో, గిరిజనుల రాకపోకల కోసం పక్కనే తాత్కాలికంగా తూరలతో వంతెన నిర్మించారు. అయితే ఈ ఇది శనివారం కురిసిన వర్షాలకు పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో బలపం పంచాయతీలోని కుడుముల, సుర్తిపల్లి, వలసపల్లి, వీరవరం గ్రామాలకు చెందిన 500 కుటుంబాలతో పాటు, గూడెం కొత్తవీధి మండలం జెర్రెల, మొండిగెడ్డ పంచాయతీలకు చెందిన 20 గ్రామాలకు రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. ఈ మార్గం గుండానే పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నిత్యావసర సరకులు తరలించడం, ఉపాధ్యాయుల రాకపోకలు, అత్యవసర సమయాల్లో రోగులను అంబులెన్స్‌ ద్వారా ఆసుపత్రులకు తరలించడం వంటివి జరుగుతుంటాయి. పది రోజుల క్రితం కోతకు గురైన ఈ వంతెనకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. కానీ తరచూ ఈ తూరల కల్వర్టు ధ్వంసమవుతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాత్కాలిక దారిని పునరుద్ధరించడంతో పాటు, కోరుకొండ–బూరుగుబయలు రహదారి, శాశ్వత వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పలు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి

కోరుకొండ నుంచి బూరుగుబయలు మార్గంలో గిరిజనులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు వెంటనే తాత్కాలిక రహదారి సౌకర్యాన్ని పునరుద్ధరించాలి. ఇక్కడ శాశ్వత వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం, వర్షాలకు తాత్కాలిక పైపుల కల్వర్టు తరచూ కోతకు గురికావడంతో అనేక గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గెడ్డ ఉధృతి అధికంగా ఉండటంతో వాగు దాటడానికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి.

– గబులంగి మోహన్‌రావు,

వైఎస్సార్‌సీపీ నేత, బలపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement