భద్రాచలం (తెలంగాణ): భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని శనివారం ఏపీకి చెందిన అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం వారికి పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంతేకాక భద్రాచలం పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా ఎంపీ తనుజారాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటపాక వైఎస్సార్ సీపీ నాయకులు అన్నెం రామిరెడ్డి, ఆకుల వెంకటరామారావు, తోట శశికుమార్, రాము, సారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


