విఘ్నాలు తొలగించే ఒడ్డిమెట్ట వినాయకుడు | - | Sakshi
Sakshi News home page

విఘ్నాలు తొలగించే ఒడ్డిమెట్ట వినాయకుడు

Sep 13 2026 1:00 AM | Updated on Sep 13 2026 1:00 AM

జాతరకు వేలాదిగా తరలిరానున్న భక్తులు

రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం

ఏర్పాట్లు చేసిన

దేవదాయ శాఖ

నక్కపల్లి: విఘ్నాలు తొలగించే వినాయకుడిగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వినాయకచవితి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. చవితినాడు గణపతిని దర్శించుకునేందుకు అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పాయకరావుపేట, నక్కపల్లి తదితర పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు.

తాటి చెట్టు మొదలులో వెలిసిన స్వామి

ఒడ్డిమెట్ట కై లాసగిరిపై దాదాపు నూరేళ్ల క్రితం తాటిచెట్టు మొదలులో లక్ష్మీగణపతి వెలిసినట్టు పూర్వీకుల కథనం. నామవరానికి చెందిన ఒక వ్యక్తికి కలలో స్వామి కనిపించి కై లాసగిరిపై పలానా చోట తాను వెలిసినట్లు చెప్పడంతో అక్కడ తవ్వకాలు జరుపగా విగ్రహం బయటిపడింది. ఐదో నంబరు జాతీయరహదారికి ఆనుకుని పందిర వేసి విగ్రహం పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. రహదారిపై ప్రయాణించే వారు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు విరాళాలు సేకరించి కొండపై ఆలయాన్ని నిర్మించారు. తర్వాత ఈ ఆలయం దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. చవితినాడు ఇక్కడ భారీ ఎత్తున జాతర జరుగుతుంది. వేకువ జామునుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు తొలుత ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు ప్రారంభిస్తారు. వినాయకుడిని దర్శించుకుని ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం.

ఇక్కడ గణపతి ఆలయంతోపాటు కాశీవిశ్వేశ్వర స్వామి, కనకదుర్గ, లక్ష్మీనారాయణ, నవగ్రహ ఆలయాలున్నాయి.

ఒడ్డిమెట్ట గ్రామస్తుల ఇలవేల్పు

ఒడ్డిమెట్ట గ్రామస్తులు లక్ష్మీగణపతిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. సంక్రాంతి, ఉగాది తర్వాత అంతే ఘనంగా వినాయక చవితిని వారు జరుపుకొంటారు. చవితినాడు బంధువుల రాకతో ఇళ్లన్నీ సందడిగా ఉంటాయి.

నవరాత్రులకు ఏర్పాట్లుపూర్తి

తొమ్మిది రోజుల పాటు జరిగే మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన పాలకమండలి చైర్మన్‌ పైలా నూకన్ననాయుడు, అర్చకులు జయంతి గోపాల కృష్ణ తెలిపారు. ఉదయం 5గంటల నుంచే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. 14వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ర ప్రత్యేకదర్శనం కోసం టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

పోలీసు బందోబస్తు

వినాయకచవితి సందర్భంగా ఒడ్డిమెట్ట వినాయకుడిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్‌ఐ సన్నిబాబుల పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతీయరహదారిని ఆనుకుని ఆలయం ఉండటంతో ట్రాఫిక్‌జాం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మెట్లమార్గం వరకు వాహనాలను అనుమతించకుండా రోడ్డుపైనే పార్కింగ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భక్తులు క్యూలైన్ల ద్వారానే స్వామిని దర్శించుకోవాలన్నారు. నక్కపల్లి, పాయకరావుపేటలనుంచి పోలీస్‌ సిబ్బందిని రప్పించి బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులు, దాతల విరాళాలు సేకరించి రూ.20లక్షల వ్యయంతో కొండపైకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement